యాదాద్రి, వెలుగు : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్అభ్యర్థి తీన్మార్మల్లన్న గెలుపునకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన సంగతిని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు.
ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని చెప్పారు. ఎన్నికల కోడ్ముగియగానే.. రుణమాఫీ చేయడంతోపాటు ఫీజురీయింబర్స్మెంట్విడుదల చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, రవికుమార్, ప్రమోద్ కుమార్పాల్గొన్నారు.
తీన్మార్ మల్లన్న అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
తుంగతుర్తి, వెలుగు : నల్గొండ, ఖమ్మం ,వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే మందుల సామేలు, కాంగ్రెస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్ కోరారు. తిరుమలగిరి మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తుందని తెలిపారు.
ఆగస్టు 15లోపు రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. బీఆర్ఎస్హయాంలో యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా పదేండ్లు పబ్బం గడిపారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియగానే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీకి డిపాజిట్లు కూడా రావన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోవర్ధన్ రాంబాబు, లింగరాజు, నరేశ్, సుధాకర్, కొండరాజు, వెంకన్న పాల్గొన్నారు.
మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి
డిండి(దేవరకొండ), వెలుగు : వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ కోరారు. దేవరకొండలోని బంజారా భవన్లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్న ఒంటరిగా పోటీ చేసి లక్షా అరవై వేల పైచిలుకు ఓట్లు సాధించారని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్అండతో భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఉద్యోగ భద్రత విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఎంప్లాయి ఫ్రెండ్లీ విధానం దేశానికే గర్వకారణమని, కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నర్సింహారెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొర్ర రాంసింగ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు యూనిస్, పట్టణ మాజీ సర్పంచ్వెంకటేశ్ పాల్గొన్నారు.
తీన్మార్ మల్లన్నను గెలిపించాలి
నకిరేకల్, (వెలుగు) : ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కోరారు. నకిరేకల్ పట్టణంలోని పీఆర్టీయూ సంఘం నాయకులు, ఉపాధ్యాయులను ఎమ్మెల్యే కలిసి ఓటు అభ్యర్థించారు. కార్యక్రమంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.