ఖైరతాబాద్,వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం బీసీ కుల గణనకు కట్టుబడి ఉందని, దానిపై మేధావులతో సంప్రదింపులు జరుపుతుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తాను విద్యార్థి దశనుంచే రాజకీయాల్లో ఉన్నానని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. తమ నేత రాహుల్‌గాంధీ బీసీల కుల గణనపై ఎప్పటి నుంచో చెబుతున్నారని గుర్తు చేశారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ‘ రాష్ట్రంలో సమగ్ర కులగణన సాధనకు ‘ బీసీ మేధావులు– విద్యావంతులు – కుల సంఘాల పాత్ర’ అంశంపై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం రౌండ్‌టేబుల్‌సమావేశంలో మంత్రి మాట్లాడారు.
పారదర్శకంగా, న్యాయ, చట్టబద్ధంగా కులగణన ద్వారా బీసీలు లాభం పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. మేధావులంతా సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. తన శాఖలో ఉన్నతాధికారులు ప్రిన్సిపల్సెక్రటరీ, శాసన సభ కార్యదర్శి అందరూ బీసీ సామాజికవర్గమే అన్నారు. కులగణన పాత 10 జిల్లాల ప్రకారమా..లేక కొత్త జిల్లాల ప్రకారమా అన్నది తేలాల్సి ఉందన్నారు.
మేనిఫెస్టోలో పెట్టిన దానికి అదనంగా కుల గణనకు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రాహుల్‌గాంధీని కలిసి సందర్భంగా సామాజిక న్యాయం కోసం మాట్లాడారని జస్టిస్చంద్రకుమార్గుర్తుచేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ కమిషన్మాజీ అధ్యక్షుడు బీఎస్‌రాములు, బలహీన వర్గాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చిన్న శ్రీ శైలం యాదవ్, మాజీ ఐఏఎస్ చిరంజీవి, ప్రొఫెసర్ మురళీ మోహన్, బీసీ నేతలు, మేధావులు పాల్గొన్నారు.