వీఆర్ఏల సమస్యలను పరిష్కరించని వాళ్ళు, దేశం కోసం పార్టీ పెట్టి ఏం చేస్తారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా భువనగిరిలోని గాంధీ పార్క్ లోని మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీ ఆశయాల కోసం కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 30 మంది వీఆర్ఏలు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఇప్పటికీ వీఆర్ఏ సమస్యలను పరిష్కరించలేదని ఆరోపించారు. రెండు రోజుల్లో వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వరంగల్ పర్యటనలో భాగంగా వీఆర్ఏలు సమస్యలు పరిష్కరించాలని మీ దగ్గరికి వస్తే ఎలా ప్రవర్తించాలో అందరూ చూశారన్న కోమటిరెడ్డి... వరంగల్ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఓ వీఆర్వో, వీఆర్ఏ గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారని గుర్తు చేశారు.
తెలంగాణ మొత్తం బంగారం అయిందని, ఈరోజు భారతదేశాన్ని బాగు చేస్తానని కేసీఆర్ బయలుదేరుతున్నారని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణలో ఉన్న సమస్యలను డైవర్ట్ చేయడానికి, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తప్పించుకోవడానికి కేసీఆర్ ఇలా ప్రవర్తిస్తున్నారన్న ఆయన... కోట్ల రూపాయలతో 33 జిల్లాల్లో పార్టీ ఆఫీసులు కట్టుకున్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం ఎంతోమంది ప్రాణ త్యాగం చేశారని, అలాంటి వాళ్ళు ఈ గడ్డ కోసం అమరులైనందుకు చాలా బాధనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.