- మేము డ్రగ్స్ టెస్ట్ చేసుకున్నం నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది
- సవాల్ విసిరిన ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి
- హాస్పిటల్‌కు వస్తానని చెప్పి కౌశిక్ రెడ్డి డుమ్మా కొట్టిండు
- ఆంబోతు లెక్క మాట్లాడటం కాదు.. ఇచ్చిన సవాల్ స్వీకరించాలని హితవు
బషీర్ బాగ్, వెలుగు: జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ వ్యవహారంలో బీఆర్ఎస్ లీడర్ల సవాల్‌ను కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ స్వీకరించారు. హైదర్‌గూడలోని అపోలో హాస్పిటల్‌కు వెళ్లి బ్లడ్ శాంపిల్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా అనిల్ యాదవ్ మాట్లాడారు. ‘‘డ్రగ్స్ టెస్ట్ కోసం ఏఐజీ హాస్పిటల్‌కు వస్తానని చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. డుమ్మా కొట్టిండు. నేను, మా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఏఐజీ హాస్పిటల్లో రాత్రి 8.30 గంటలకు వచ్చి.. 10 వరకు ఉన్నం. బుధవారం పొద్దున ఇద్దరం కలిసి హైదర్గూడా అపోలో హాస్పిటల్‌కు వచ్చి డ్రగ్స్ టెస్ట్ కోసం శాంపిల్స్ ఇచ్చినం. మాకు నెగిటివ్ రిపోర్టు వచ్చింది. ధైర్యం ఉంటే వచ్చి బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలి’’అని కౌశిక్ రెడ్డికి అనిల్ యాదవ్ సవాల్ విసిరారు.
ఆ ఇద్దరూ డ్రగ్స్ తీసుకున్నట్లు డౌట్ వస్తున్నది: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
ఈ మధ్య కాలంలో కేటీఆర్, కౌశిక్ రెడ్డి డ్రగ్స్ తీసుకున్నట్లు డౌట్ వస్తున్నదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు. అందుకే డ్రగ్స్ టెస్ట్ చేసుకోకుండా తప్పించుకుని తిరుగుతున్నారని విమర్శించారు. ‘‘కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నట్లు మాకు అనుమానాలున్నయ్.. అందుకే శాంపిల్స్ ఇవ్వు అంటే పారిపోతున్నడు’’అని వెంకట్ సూచించారు. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కష్టపడుతుంటే.. బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి ఆంబోతులెక్క మాట్లాడటం మానుకోవాలన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు.