బడ్జెట్​లో విద్యకు రూ.60 వేల కోట్లు కేటాయిస్తాం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

నల్గొండ అర్బన్, వెలుగు: రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే బడ్జెట్ లో విద్యకు రూ.60 వేల కోట్లు కేటాయిస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్​ ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో స్వేరోస్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన బహుజన విద్యార్థి గర్జనకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.. ఎడ్యుకేషన్​కు బడ్జెట్ లో ఎన్ని నిధులు కేటాయించారో ముఖ్యమంత్రితో చర్చించేందుకు తాను సిద్ధమన్నారు. 


రాష్ట్రంలో వరుసగా పోటీ పరీక్షల షెడ్యూల్ ​విడుదల చేయడంతో లక్షల మంది గ్రూప్-–2 అభ్యర్థుల ఆందోళన చెందుతున్నారని,  మరో మూడు నెలలు గ్రూప్-–2 వాయిదా వేయాలన్నారు. జాంబవ స్పార్క్ కేంద్రాలను ఏర్పాటు చేసి 12 వేల గ్రామాల్లో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచితంగా ఏసీ కోచింగ్​ సెంటర్లు పెట్టి శిక్షణ ఇస్తామన్నారు. యువతకు స్థానిక సంస్థల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పించి, మంత్రిత్వ శాఖల్లో షాడో మంత్రులుగా నియమిస్తామన్నారు. 


ప్రతి ఏడాది టీఎస్పీఎస్సీ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. ఎంవీఎఫ్​జాతీయ కన్వీనర్ ఆర్.వెంకట్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి, యువత కోసం బడ్జెట్ లో రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తామని బీఎస్పీ హామీ ఇవ్వడం హర్షించదగ్గదన్నారు. అంతకుముందు నార్కట్ పల్లి–-అద్దంకి బైపాస్ నుంచి లక్ష్మీ గార్డెన్ వరకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. 


కార్యక్రమానికి స్వేరోస్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనుముల సురేశ్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర అధ్యక్షుడు మొగిలిపాక నవీన్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ ముదిగొండ, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రాజ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయిబాబా, మహిళా విభాగం రాష్ట్ర ఇన్​చార్జి మాధవి, రాష్ట్ర సహాయ కార్యదర్శి అందే అజయ్, జిల్లా అధ్యక్షుడు ఆకులపల్లి నరేశ్​పాల్గొన్నారు