మరో మూడు రోజుల్లో మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటిస్తామని ఆ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ తెలిపారు. చండూరులో యువజన కాంగ్రెస్ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో మధుయాష్కీ గౌడ్ పాల్గొన్నారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో యువత కార్యాచరణపై చర్చించామన్నారు. దేశంలో మార్పు తీసుకురావడంలో యువకుల పాత్ర అత్యంత కీలకమని చెప్పారు. ఎంతోమంది యువకులు ఉన్నత చదువులు చదివి పదివేల జీతాలకే పని చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల అంశంలో ప్రకటనలకే పరిమితమైంది తప్ప..ఇచ్చిందేమి లేదని మధుయాష్కి గౌడ్ విమర్శించారు. యువజన కాంగ్రెస్ తరుపున నిరుద్యోగ భృతి, ఉద్యోగ కల్పన కోసం ఉద్యమం చేపడుతామన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టబోతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలం ప్రజలేనని చెప్పారు.