- మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు
హైదరాబాద్: ‘‘రాష్ట్రంలో బెల్ట్ షాపులను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది.. బెల్ట్ షాపులను నిరోధించాల్సిన పోలీస్ లు ఆందోళన చేస్తున్న మహిళలపై దాడులు చేస్తున్నారు.. రాష్ట్రంలో మద్యం ఏరులై పారి మహిళలపై దాడులు జరుగుతున్నాయి.. బెల్ట్ షాపులపై మహిళా కాంగ్రెస్ అధ్వర్యంలో దాడులు జరుపుతాం..’’ అని మహిళా కాంగ్రెస్ అద్యక్షురాలు సునీతారావు హెచ్చరించారు.
ప్రభుత్వం మద్య పానానికి పెద్దపీట వేస్తూ.. న్యాయ వ్యవస్థను పట్టించుకోవడం లేదు
రాష్ట్రంలో మద్యపానానికి పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం న్యాయ వ్యవస్థను పట్టించుకోవడం లేదని సునీతారావు ఆందోళన వ్యక్తం చేశారు. జరుగుతున్న ఆగడాలపై మహిళా మంత్రులు మాట్లాడడం లేదని విమర్శించారు. రాష్ట్ర మంత్రుల బినామీలు పబ్ లు క్లబ్ లు నడుపుతున్నారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వానికి మద్యం పై వచ్చే అదాయంపైనే దృష్టి పెడుతోందన్నారు. రాష్ట్రంలో మద్యపానం, గంజాయి, డ్రగ్స్ ముఠాలు రాజ్యమేలుతున్నాయన్నారు. స్వయంగా మంత్రులే గుట్కాలు తింటున్నారని ఆమె విమర్శించారు. జరుగుతున్న ఆగడాలపై ఫిర్యాదులు చేద్దామంటే సీఎం, మంత్రులు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదన్నారు. గవర్నర్ ను కలుద్దామంటే వారి అపాయింట్ మెంట్ దొరకదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న క్రైమ్ రేటుకి రాష్ట్ర క్యాబినెట్ బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తుందని ఆమె దుయ్యబట్టారు.