న్యూఢిల్లీ: ప్లేస్టోర్‌లో ఉంచే పర్సనల్ లోన్ పాలసీని గూగుల్ కఠినం చేసింది. అప్పుల రికవరీలో అనైతికంగా వ్యవహరిస్తున్న యాప్‌లు, కంపెనీలు పెరగడంతో ఈ చర్య తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఫొటోలు, వీడియోలు, కాంటాక్ట్స్, లొకేషన్, కాల్ లాగ్స్ వంటి యూజర్ల డేటాను ఆ యాప్స్ సేకరించడానికి వీలు లేని విధంగా కొత్త రూల్స్‌ను గూగుల్ తెచ్చింది. ఈ ఏడాది మే 31 నుంచి కొత్త పాలసీ అమలులోకి వస్తుందని కంపెనీ వెల్లడించింది. పర్సనల్ లోన్ యాప్ డిక్లరేషన్ కంప్లీట్ చేయాలని ప్లేస్టోర్‌లోని లోన్ యాప్స్‌ను కోరినట్లు తెలిపింది. అంతేకాదు, అందుకు అవసరమైన డాక్యుమెంట్లనూ ఇవ్వాలని వాటిని ఆదేశించింది. పర్సనల్ లోన్లు ఇవ్వడానికి ఆర్బీఐ లైసెన్స్ ఉంటే ఆ లైసెన్స్ వివరాలను తమకు సబ్మిట్ చేయాలని సూచించింది.
తమంతట తాముగా అప్పులు ఇవ్వకుండా, ప్లాట్‌ఫామ్‌గా వ్యవహరిస్తూ లోన్లకు ఫెసిలిటేటర్లుగా వ్యవహరిస్తుంటే, ఆ విషయం స్పష్టంగా తెలిసేలా ఉండాలని గూగుల్ వెల్లడించింది. చాలా బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు కొన్ని యాప్స్ ప్లాట్‌ఫామ్స్‌గా మాత్రమే ఉంటున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, ఏ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలతో కలిసి పనిచేస్తున్నదీ కూడా స్పష్టంగా యాప్ డిస్క్రిప్షన్లో ఉండాల్సిందేనని గూగుల్ స్పష్టం చేసింది. లెండింగ్ యాప్స్ కోసం డిక్లరేషన్ ఫార్మాట్‌ను గూగుల్ రిలీజ్ చేసింది. తమ లోన్ యాప్స్‌ను ప్లేస్టోర్‌లో ఉంచాలంటే ఈ డిక్లరేషన్‌తో పాటు, అవసరమైన డాక్యుమెంట్లను ఇవ్వాల్సిందేనని గూగుల్ పేర్కొంది.