ఇందూర్కు వ్యవసాయ, ఇంజినీరింగ్ కాలేజీలు తెస్తం.. పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్​ గౌడ్ వెల్లడి

ఇందూర్కు వ్యవసాయ, ఇంజినీరింగ్ కాలేజీలు తెస్తం.. పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్​ గౌడ్ వెల్లడి

నిజామాబాద్, వెలుగు:  ఇందూరు జిల్లా ప్రజల చిరకాల కోరికైన ప్రభుత్వ వ్యవసాయ, ఇంజినీరింగ్ కాలేజీలు తప్పక తెస్తామని  టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్​కుమార్​ గౌడ్​హామీ ఇచ్చారు.  ఎంతో మంది అంతర్జాతీయ క్రీడాకారులను అందించిన ఇందూర్​లో మినీ స్టేడియం, సింథటిక్​ట్రాక్​ నిర్మిస్తామని పేర్కొన్నారు. మంగళవారం నిజామాబాద్ లోని 40 డివిజన్​గౌతంనగర్ లో పేద కుటుంబం ఇంట్లో ఆయన సన్న బియ్యం అన్నం తిన్నారు. అనంతరం డీసీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. నందిపేట సెజ్​ను పూర్తిస్థాయిలో నిర్మిస్తామన్నారు. 

వ్యవసాయపరంగా ఉత్తర తెలంగాణలో నిజామాబాద్​జిల్లా వైభవం గత బీఆర్ఎస్​హయాంలో దెబ్బతిన్నదని.. పునర్నిర్మించే చర్యలు చేపట్టామన్నారు. ప్రధాని మోదీ రూపొందిన వ్యవసాయ వ్యతిరేక చట్టాలకు నాడు కేసీఆర్​మద్దతు ఇవ్వగా కాంగ్రెస్​ అన్నదాతల పక్షాన పోరాడి రద్దు చేయించిందన్నారు. ​ సన్న వడ్లకు రూ.500 బోనస్​ ఇవ్వడంతో రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల వరి సాగు 40 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. 281 లక్షల మెట్రిక్​టన్నుల వడ్ల దిగుబడితో దేశంలో ఫస్ట్ ప్లేసులో నిలిచిందన్నారు.  

రైతుల నుంచి కొనుగోలు చేసిన సన్న వడ్లను బియ్యంగా రేషన్ కార్డుల ద్వారా పేద కుటుంబాలకు ఇస్తూ ఆకలి తీరుస్తున్నామన్నారు. ఇది కూడా దేశంలోనే రికార్డన్నారు. ​ ప్రాణహిత 21,22,23 ప్యాకేజీలు పూర్తి చేయిస్తామని, ఎస్సారెస్పీ, నిజాంసాగర్​ ప్రాజెక్టుల్లో పూడిక తీయించి, మరో లక్షన్నర ఎకరాల సాగు పెంచుతామన్నారు. గుత్ప, అలీసాగర్​ లిఫ్టుల స్థాయి పెంచుతామన్నారు.  బీసీలకు 42 శాతం రిజర్వేషన్​ బిల్లు రూపొందించామన్నారు.  వచ్చే ఎన్నికల్లో 90 సీట్లు సాధిస్తామన్నారు. బోధన్​ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి, స్టేట్​కార్పొరేషన్​ చైర్మన్లు​తాహెర్, మానాల మోహన్​రెడ్డి, నుడా చైర్మన్​ కేశవేణు, డీసీసీబీ చైర్మన్​కుంట రమేశ్​రెడ్డి, శేఖర్​గౌడ్, రత్నాకర్​, జావెద్​ అక్రమ్, రాంభూపాల్​, రామకృష్ణ, సంతోష్​, ప్రమోద్​, వేణురాజ్​, బొబ్బిలి రామకృష్ణ, మధు తదితరులు ఉన్నారు.