నూటికి నూరు శాతం ఇందిరమ్మ ఇళ్లులు కట్టించే బాధ్యత మాది: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

నూటికి నూరు శాతం ఇందిరమ్మ ఇళ్లులు కట్టించే బాధ్యత మాది: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

నల్లగొండ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో యువకులు ప్రాణాలు వదులుకుంటుంటే అది చూసి చలించి సోనియమ్మ తెలంగాణ ఇచ్చిందని.. కానీ 10 సంవత్సరాలలో రాష్ట్రంలో ఎవరి బతుకులు బాగుపడలేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్రం వచ్చిన పదేండ్ల తర్వాత  మీ అందరి ఆశీర్వాదంతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని.. మీకు అండగా ఉండాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు. 

బుధవారం నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ ఫంక్షన్ హాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సెర్ప్ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవాల కార్యక్రమంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన మహిళలకు ఎంత చేసినా తక్కువేనని అన్నారు.  

మహిళకు ఉన్నంత శక్తి విశ్వంలో మరెవరికి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తోన్న ఇందిరమ్మ ఇళ్లు మహిళల పేరు మీదే ఇస్తున్నామని తెలిపారు. నూటికి నూరు శాతం పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లులు కట్టించే బాధ్యత మా ప్రభుత్వానిదని హామీ ఇచ్చారు. మహిళా శక్తి క్యాంటీన్లకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల రుణ సదుపాయం అందిస్తోందని తెలిపారు.