మహబూబాబాద్ జిల్లా: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అద్భుతమైన పోరాటాల గడ్డ మహబూబాబాద్ కు తలవంచి నమస్కరిస్తున్నా అని కేసీఆర్ చెప్పారు. “తెలంగాణలో ఇచ్చేంత పెన్షన్ దేశంలో ఎవరూ ఇవ్వటంలేదు. మే నుంచి రూ.2వేల పెన్షన్ వస్తుంది. గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపడానికే చిన్న జిల్లాలు చేశాం. మహబూబాబాద్ లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తాం. ఎంత ఖర్చైనా సరే భూసంబంధ పంచాయతీలు లేకుండా చేస్తా. ప్రజాదర్బార్ పెట్టి నాలుగైదురోజులు ఉండి సమస్యలు పరిష్కరిస్తా” అని కేసీఆర్ చెప్పారు.
కలెక్షనే లేని చోట కలెక్టర్ అనే పేరు బాగాలేదు
“రెవెన్యూ అనే పేరు బేకార్ గా ఉంది. కలెక్టర్ పేరు కూడా మార్చాలని ఆలోచిస్తున్నా. కలెక్షనే లేని దగ్గర కలెక్టర్ అని పేరు బాగాలేదు. జిల్లా పాలనాధికారి అని పెట్టాలని చూస్తున్నా. ప్రభుత్వమే ఉల్టా పైసలు ఇస్తుంటే ఇంకా కలెక్షన్ ఎక్కడ ఉంది” అన్నారు కేసీఆర్.
సెంట్రల్ లో ఫెడరల్ ఫ్రంట్ రావాలన్నారు కేసీఆర్. 1947 నుంచి నెహ్రూ, ఇందిర, రాజీవ్, రాహుల్.. అందరూ గరీబీ హఠావో అంటున్నారు.. కానీ ఏం చేయడం లేదని.. వాళ్లతో అయ్యేదేం లేదని అన్నారు కేసీఆర్. నరేంద్రమోదీ అవకాశమున్నా డైలాగులు చెప్పడమే తప్ప..చేతలు చూపడం లేదని చెప్పారు.
ప్రస్తుత ఎంపీ సీతారాం నాయక్ ఏం తప్పు చేయలేదనీ… కొన్ని కారణాల వల్లే అభ్యర్థిని మార్చామని … ప్రభుత్వంలో సీతారాం నాయక్ కు మంచి గౌరవం ఇస్తామని కేసీఆర్ చెప్పారు.