- ఫ్రీ వాటర్ స్కీమ్‌కు అర్హత ఉండి అప్లయ్ చేసుకోని వాళ్లు బిల్లులు చెల్లించాలె
- జలమండలి ఎండీ దాన కిశోర్
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు అందిస్తున్న నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటి పథకానికి అర్హులు కాని, నమోదు చేసుకోని వారి నుంచి ఈ జనవరి నుంచి నల్లా బిల్లులను, బకాయిలను వసూలు చేయాలని జలమండలి ఎండీ దాన కిశోర్ ఆదేశించారు. శనివారం జలమండలి ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రేటర్ పరిధిలో 4.20 లక్షల మంది వినియోగదారులు అర్హత ఉండి కూడా ఉచిత నీటి పథకానికి నమోదు చేసుకోలేదన్నారు.
నమోదు చేసుకోని వారి నుంచి జనవరి నుంచి బిల్లులు వసూలు చేయాలని, అవసరమైతే నోటీసులు జారీ చేయాలని సూచించారు. ఇండల్లో మీటర్లు పనిచేస్తున్న వారు ఆధార్ లింక్ చేసుకొని ఈ పథకానికి నమోదు చేయించుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మిగతా వినియోగదారులు కూడా మీటరు ఏర్పాటు చేసుకుని ఆధార్ అనుసంధానం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.
నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటి పథకానికి ఎప్పుడైనా నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఆధార్ అనుసంధానంలో ఇబ్బందులుంటే తీర్చడానికి కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. త్వరలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నందున సెక్షన్లవారీగా చేపట్టాల్సిన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు.