
వరంగల్: వచ్చే ఏడాది డిసెంబర్‌లోగా దేవాదుల ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా దేవన్నపేట వద్ద నిర్మించిన పంప్ హౌజ్‌ను మంత్రులు ఉత్తమ్, పొంగులేటి స్విచ్ ఆన్ చేసి గురువారం (మార్చి 27) ప్రారంభించారు. అనంతరం ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద గోదావరి జలాలకు మంత్రులు ఇద్దరు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ ప్రజలకు మాటిస్తున్నాం.. 2026 డిసెంబర్ లోగా దేవాదుల ప్రాజెక్ట్ మొత్తం పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
రెండున్నర దశాబ్దాలుగా దేవాదుల ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. ఇందులో మూడవ ఫేస్ దేవన్నపేట పంప్ హౌజ్‌ను ఇవాళ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. 600 క్యూసెక్కుల నీటిని ఈ మోటార్ ద్వారా ఎత్తిపోస్తున్నామని తెలిపారు. 15 రోజుల్లో మరొక మోటార్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను తక్కువ ఖర్చుతో పూర్తిచేసి సాగు, తాగు నీరందిస్తామని పేర్కొన్నారు.
Also Read : డా.బీఆర్ అంబేద్కర్ వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు
మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేకపోయినా ఇందిరమ్మ ప్రభుత్వం అందరి సంక్షేమ కోసం పని చేస్తోందని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో స్టార్ట్ అయిన దేవాదుల పనులు ఇప్పుడు అదే ప్రభుత్వంలో పూర్తి అవుతున్నాయన్నారు. దేవాదుల ప్రాజెక్ట్‌లోని దేవన్నపేట మోటారును ప్రారంభించామని.. దీని ద్వారా 600 నుంచి 650 క్యూసెక్కుల నీళ్లు ధర్మసాగర్‌కు చేరుతాయని తెలిపారు. తెలంగాణను సస్యశ్యామలంగా మార్చేందుకు ఇందిరమ్మ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.