నాగర్‌కర్నూల్, వెలుగు : ‘పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ కృష్ణా బేసిన్‌లో ఒక్క ప్రాజెక్ట్‌ను కూడా పూర్తి చేయలేదు, కాంగ్రెస్ హయాంలో చేపట్టిన జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టులన్నీ అసంపూర్తిగానే మిగిలిపోయాయి.. ఐదేండ్లలో ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగు నీరు ఇస్తాం’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేశ్‌రెడ్డి, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణతో కలిసి ఆదివారం నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో సబ్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం బిజినేపల్లిలో మార్కండేయ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ మార్కండేయ లిఫ్ట్‌తో బిజినేపల్లి మండలంలోని 18 గిరిజన తండాలు, 5 గ్రామాల్లో 7,310 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. రూ. 76 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ లిఫ్ట్‌కు గత ప్రభుత్వం కేవలం రూ. 6 కోట్లు మంజూరు చేసి, రూ. 4 కోట్లే విడుదల చేసిందన్నారు. ఎన్నికలకు ముందు అంచనాలను రూ.83 కోట్లకుపెంచినా పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. వచ్చే ఐదేండ్లలో ప్రాధాన్యతాక్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు సాగు నీరిస్తామన్నారు.
అచ్చంపేట నియోజకవర్గంలో ఉమామహేశ్వర, చెన్నకేశవ ఎత్తిపోతల ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామన్నారు. రైతులకు పంట నష్టపరిహారంతో పాటు పంట బీమా, రైతు బీమా ప్రీమియం డబ్బులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పాలమూరు జిల్లాలో క్లీన్‌స్వీప్ చేయాలని పిలుపునిచ్చారు.
ఈ నెల 26 నుంచి పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. ఆయా కార్యక్రమాల్లో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, సీవో విజయభాస్కర్‌రెడ్డి, ఎస్‌ఈ సత్యనారాయణ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.