రంగారెడ్డి: తమ ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం న్యాయం చేయకపోతే త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో వెయ్యి మంది సభ్యులు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలో దిగుతామని శంకర్ హిల్స్ ప్లాట్స్ పర్చేజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు సువర్ణ రెడ్డి, కార్యదర్శి కృష్ణారెడ్డిలు హెచ్చరించారు. హైదరాబాద్ లోని విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ డీజీ కార్యాలయంలో వారు కబ్జాదారులపై ఫిర్యాదు చేశారు.
1983 లో రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం వట్టి నాగులపల్లి గ్రామంలోని 460 ఎకరాలలోని 3333 ప్లాట్లను కొనుగోలు చేసిన 3228 మంది ఓనర్స్ ని సైట్ మీదకు రానివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న జైహింద్ రెడ్డి, వైవి.సుబ్బారెడ్డి, మేఘ కృష్ణారెడ్డిలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాము కొనుగోలు చేసిన ప్లాట్లను ప్రభుత్వ పెద్దల అండతో వ్యవసాయ భూమిగా చిత్రీకరించి విద్యుత్ పర్మిషన్ తీసుకొని కబ్జాకు యత్నిస్తున్నారని ఆరోపించారు.
ఈ విషయంపై గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశామని...ప్లాట్ల వద్దకు వస్తేకేసులు పెడతామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ తక్షణమే స్పందించి తమ ప్లాట్లు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. తమకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర గవర్నర్, ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామని వారు స్పష్టం చేశారు.
ALSO READ :- రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్కు షాక్.. కురుమ సంఘం నేత రాజీనామా