- కరీంనగర్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం
- డీఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు విశారదన్ మహరాజ్
కరీంనగర్, వెలుగు : వెలమ, రెడ్డి, కరణం దొరల చేతిలో తెలంగాణ బందీగా మారిందని ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ ఆరోపించారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే ధర్మ సమాజ్ పార్టీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ ఏర్పాటు సందర్భంగా సోమవారం రాత్రి కరీంనగర్ సిటీలో అలుగునూరు నుంచి రెవెన్యూ గార్డెన్స్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తర్వాత ఏర్పాటు చేసిన సభలో విశారదన్ మహరాజ్ మాట్లాడుతూ భూమి, సంపద, రాజకీయం సమస్తం ఆధిపత్య వర్గాల చేతుల్లోనే ఉందని, 90 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు పదిశాతం ఉన్న అగ్రవర్ణాల కింద నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రవాళ్లు తెలంగాణను దోపిడీ చేసింది ఒక్క శాతం మాత్రమేనని, రెడ్డి, వెలమ, కరణం దొరలే 99 శాతం దోపిడీని నిరాటంకంగా కొనసాగిస్తున్నారని విమర్శించారు.
ఇలాంటి అధికార మదాన్ని దించడానికే తాము బయల్దేరామని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అణగారిన వర్గాలతో డీఎస్పీ పోటీ చేయిస్తుందని వెల్లడించారు. ఎంఐఎం ముస్లింల కోసం పని చేస్తూ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుస్తూనే 50 నియోజకవర్గాల్లో తన ప్రభావాన్ని చూపిస్తోందని, అంతకంటే ఎక్కువ జనాభా ఉండి అణచివేతకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఒక పార్టీ అవసరమనే ఉద్దేశంతోనే డీఎస్పీని స్థాపించినట్లు తెలిపారు. కరీంనగర్ జిల్లా డీఎస్పీ అధ్యక్షుడు శ్రీకాంత్ మహరాజ్, నాయకులు తిరుపతి, హరీష్ గౌడ్, బాబు, లావణ్య, పరమేశ్వరి, గణేష్, మీడియా ఇన్చార్జి ఆర్పీ మహరాజ్ పాల్గొన్నారు.
డీఎస్పీ పరకాల అభ్యర్థిగా రమేశ్
హనుమకొండ సిటీ : పరకాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పూరెళ్ల రమేశ్‌ను ఆ స్థానంలో తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు డీఎస్పీ అధ్యక్షుడు డా.విశారదన్మహరాజ్ చెప్పారు. దీనికి సంబంధించి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అగ్రకుల భూస్వామ్య శక్తులే రాజకీయంగా శాసిస్తున్నాయన్నారు. తాము అధికారంలోకి వస్తే మేడారాన్ని రెండో రాజధానిగా మారుస్తామని, కేయూకు సమ్మక్క సారలమ్మ పేరు పెడతామన్నారు.