తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తాం: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తాం: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించేందుకు కృషి చేస్తామని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ఎగరేసిన ఆయన.. రాజ్యాంగం దేశానికి ఆదర్శమని అన్నారు. డా.బి.ఆర్. అంబేడ్కర్ అధ్యక్షతన ఏర్పడిన రాజ్యాంగం దేశంలోని అన్ని వర్గాల అభివృద్ధికి మార్గం సుగమం చేసిందని పేర్కొన్నారు. 

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని గవర్నర్ అన్నారు.  ప్రజా ప్రభుత్వం బాగుందని, తెలంగాణ గీతం అద్భుతంగా ఉందని కొనియాడారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుతో సంస్కృతిని చాటి చెబుతున్నామని అన్నారు. తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వానికి తెలంగాణ తల్లి విగ్రహం ప్రతీక అని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులను స్మరించుకున్నారు. అదే విధంగా  జయజయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించామని, తెలంగాణ ఉద్యమకారులను గౌరవించుకున్నామని తెలిపారు.

Also Read :- పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఎగురవేసిన గవర్నర్

తెలంగాణకు వ్యవసాయం వెన్నెములాంటిదని , రైతుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తు్న్నామని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. రైతు భరోసా కింద ప్రజా ప్రభుత్వం ఏడాదికి రూ.12 వేలు అందజేస్తుందని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమిలేని పేదలకు ఏడాదికి 12 వేలు ఇస్తున్నట్లు గుర్తు చేశారు. తమ ప్రభుత్వం రైతు బీమా కొనసాగిస్తుందని తెలిపారు.

తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఎల్లవేళలా మహిళల ఆర్థిక స్వావలంబనకు  ప్రాధాన్యత ఇస్తుందని గవర్నర్ అన్నారు. గృహజ్యోతి కింద 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందిస్తున్నామని, రూ.500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నట్లు తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని, ప్రభుత్వ హాస్టళ్లలో పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని అన్నారు. 


రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశామని, రైతులకు వరికి 500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది అత్యధికంగా వరి దిగుబడి అయ్యిందని గుర్తు చేశారు. తెలంగాణలో ఒకే ఏడాది 50 వేల ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా చేశామని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు.