రామగుండంలో ఖచ్చితంగా ఎయిర్ పోర్టు తీసుకొస్తాం: మంత్రి ఉత్తమ్

 రామగుండంలో ఖచ్చితంగా ఎయిర్ పోర్టు తీసుకొస్తాం: మంత్రి ఉత్తమ్

పెద్దపల్లి: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం రికార్డ్ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాల్లో భాగంగా బుధవారం (డిసెంబర్ 4) పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన యువ వికాసం సభలో ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేండ్లలో ఒక్క టీచర్ రిక్రూట్ మెంట్ అయినా జరిగిందా అని ప్రశ్నించారు.

 

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే  నిరుద్యోగ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు.  రాష్ట్రానికి రూ.10 వేల కోట్ల పెట్టబడులు తీసుకొచ్చామని.. తద్వారా వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఓ వైపు ప్రభుత్వ రంగం.. మరోవైపు ప్రైవేట్ రంగంపై ఫోకస్ పెట్టామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 60 ఐటీఐ సెంటర్లను అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చామని గుర్తు చేశారు. 

 

కాంగ్రెస్ ప్రజా పాలనలో మహిళా సంఘాలకు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ హయాంలో విస్మరించబడ్డ పెద్దపల్లి జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఇందులో భాగంగానే రామగుండంలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు. రామగుండంలో ఖచ్చితంగా ఎయిర్ పోర్టు తీసుకొస్తామని హామీ ఇచ్చార మంత్రి ఉత్తమ్. ఈ ఏడాది కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్లు లేకుండానే రికార్డు స్థాయిలో వరి పంట సాగు వచ్చిందని తెలిపారు. 

Also Read:-పదేండ్లలో చేయలేని పనులు.. ఏడాదిలో చేస్తున్నాం..