కౌశిక్ రెడ్డిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటాం: మంత్రి శ్రీధర్ బాబు

కరీంనగర్ కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్‎ల మధ్య జరిగిన వాగ్వాదంపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదవానికి మేలు జరిగే కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తన ఏ మాత్రం బాగోలేదని ఫైర్ అయ్యారు. పోలీస్‎లు అదుపు చేసిన ఆగకపోవడం దారుణమని అన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

యువ శాసన సభ్యుడు పది మందికి ఆదర్శంగా ఉండాలి కానీ ఇలా వ్యవహరించకూడదని చురకలంటించారు. మీడియా పబ్లిసిటీ ఈ కార్యక్రమానికి రాలేదని.. ప్రజా సమస్యలపై చర్చించేందుకు భేటీ అయ్యామనే విషయం గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. ఆదివారం (జనవరి 12) జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశం హాట్ హాట్ సాగింది. కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టరేట్‎లో జరిగిన ఈ సమీక్షలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అడ్డుకున్నాడు.

ALSO READ | జనవరి- 26 నుంచి రేషన్ కార్డుల పంపిణీ: మంత్రి ఉత్తమ్

 ‘‘నువ్వు ఏ పార్టీలో గెలిచి, ఏ పార్టీలోకి వెళ్లావు. అసలు నీది ఏ పార్టీ’’ అంటూ కౌశిక్ రెడ్డి నిలదీశాడు. దీంతో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రుల ముందే ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరిని ఒకరు తోసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సమావేశం నుండి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బయటకు లాక్కెళ్లారు. కౌశిక్ రెడ్డి, సంజయ్‎ల వాగ్వాదంతో సమావేశంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.