గులాబీ విప్లవం వస్తున్నది.. కేసీఆర్​ హ్యాట్రిక్​ సీఎం అయితరు : కేటీఆర్

రాష్ట్రంలో గులాబీ విప్లవం వస్తున్నదని, కేసీఆర్​ హ్యాట్రిక్​ సీఎం అవుతారని మంత్రి కేటీఆర్​ అన్నారు. ‘‘నోట్లకు ఓట్లు అమ్ముకోవద్దు. ఓట్లు కొనే వాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కొందరు డబ్బుల సంచులతో ఓట్ల కోసం వస్తున్నరు” అని పేర్కొన్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని పలు ఏరియాల్లో కేటీఆర్​ ఆదివారం రోడ్​ షో నిర్వహించారు. ప్రతిపక్షాలు ధనాన్ని నమ్ముకున్నాయని, తాము జనాన్ని నమ్ముకున్నామని ఆయన అన్నారు.  ‘‘మేం రామభక్తులం. నా పేరే తారకరాముడు. మేం రామయ్యను తక్కువ చేసి చూడం. భద్రాద్రి రామాలయాన్ని మరో యాదాద్రి చేసి చూపిస్తం. కోడ్​ అమలులో ఉన్నందున అధికారుల సలహా మేరకు ఇప్పుడు రామదర్శనం చేసుకోలేదు.. భద్రాచలంలో మా అభ్యర్థిని గెలిపించండి, రామయ్యను దర్శించుకుంట” అని తెలిపారు. భద్రాచలం ప్రజలకు వరదల నుంచి శాశ్వత పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు.  

కేసీఆర్​ చేతిలోనే రాష్ట్రం సురక్షితం

కేసీఆర్​ చేతిలోనే రాష్ట్రం సురక్షితంగా ఉంటుందని కేటీఆర్​ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు చూపిన తెగువ అందరికి తెలిసిందేనని చెప్పారు. ‘‘నల్ల బంగారాన్ని పంటికి అందకుండా మోదీ మింగేయాలని చూస్తున్నరు. కోల్​బ్లాక్​ల ప్రైవేటీకరణపై మా ఎంపీలు నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్లమెంట్​లో మాట్లాడుతుంటే కాంగ్రెస్​ వాళ్లు ఒక్క మాట మాట్లాడలేదు” అని దుయ్యబట్టారు. సింగరేణిని కాపాడాలంటే రాష్ట్రంలో గులాబీ జెండానే ఉండాలని, అల్లా టప్పా పార్టీలు సింగరేణిని కాపాడలేవని పేర్కొన్నారు. కాంగ్రెస్​తీరు కొత్త సీసాలో పాత సారా రకమని కేటీఆర్​ విమర్శించారు. 

.‘‘స్కాంలు చేయాలి.. రాష్ట్రాన్ని మింగాలి.. ఇదే కాంగ్రెస్​ నినాదం” అని దుయ్యబట్టారు. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతరుల పోడు భూములకు పట్టాలిచ్చేందుకు కృషి చేస్తామని కేటీఆర్​ చెప్పారు. బీఆర్​ఎస్​ మళ్లీ అధికారంలోకి రాగానే అసైన్డ్​ భూములున్న వారికి పూర్తి స్థాయిలో యాజమాన్య హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆయిల్​ ఫాం రైతులకు ఉచిత విద్యుత్​ ఇస్తామని అన్నారు. సీతారామ ప్రాజెక్ట్​ను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రెండు సార్లు బీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఒకే సీటు వచ్చిందని, ఈ సారి అన్ని నియోజకవర్గాల్లో గెలుపు  బీఆర్​ఎస్​దేనని చెప్పారు. 

భద్రాద్రికి ఇచ్చిన హామీలేమైనయంటూ టీడీపీ నిరసన

కేటీఆర్​ పర్యటనలో టీడీపీ నేతలు నిరసన తెలిపారు. సీఎం కేసీఆర్​ భద్రాద్రి రామాలయం అభివృద్ధికి రూ.100కోట్లు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నిస్తూ భద్రాచలంలో టీడీపీ నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ‘‘2022 గోదావరి వరదల సమయంలో రూ.1,000 కోట్లు ప్రకటించారు. పైసా ఇవ్వలేదు. రామాలయంలో ఉత్సవ ఖర్చులు భరిస్తామన్నరు. ఆంధ్రాలో కలిసిన ఐదు పంచాయతీలను తెలంగాణలో కలుపుతమన్నరు...ఈ హామీలు ఏమైనయ్​?” అంటూ అందులో ప్రశ్నించారు. కాగా, బూర్గంపాడు మండలం సారపాక హెలీప్యాడ్​ వద్దకు మీడియాను పోలీసులు అనుమతించలేదు. దీనిపై మీడియా నిరసన తెలిపింది.