2026 మార్చి నాటికి మావోయిస్టులు ఖతం: కేంద్ర మంత్రి అమిత్ షా

నక్సలిజంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు నక్సలిజం అతిపెద్ద సవాల్ అని.. నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేసే సమయం ఆసన్నమైందని అన్నారు. మార్చి 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని తెలిపారు. మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల సీఎస్‎లు, డీజీపీలతో శనివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మావోయిస్ట్ వ్యతిరేక కార్యకలాపాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మీటింగ్ అనంతరం అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ.. గత నాలుగు దశాబ్దాల్లో నక్సలిజం కారణంగా 17,000 అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. కానీ ఛత్తీస్ గఢ్‎లో బీజేపీ ప్రభుత్వం చేపడుతోన్న అభివృద్ధి కార్యక్రమాల కారణంగా రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గాయన్నారు.

Also Read : యూపీ రాజకీయాల్లో రేర్ సీన్

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నక్సలిజం నిర్మూలనను సవాల్‌గా స్వీకరించి, మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఛత్తీస్‎గఢ్‎లో గతేడాది డిసెంబర్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2024 ఆగస్టు వరకు 126 మంది నక్సల్స్‌ మృతి చెందారని అధికారికంగా లెక్కలు వెల్లడించారు. అంతకుముందు 2022లో మావోయిస్టుల మరణాల సంఖ్య 100 కంటే తక్కువగా ఉండేదని.. మేం పవర్‎లోకి వచ్చాక నక్సలైట్ల డెత్ కౌంట్ పెరిగిందన్నారు. 14 మంది టాప్ నక్సల్స్‎ను భద్రతా దళాలు మట్టుబెట్టాయని పేర్కొన్నారు.  బీహార్, జార్ఖండ్ మహారాష్ట్ర స్టేట్లలో కూడా నక్సల్స్ ప్రభావం మునుపటి కంటే తగ్గిందని అన్నారు.