కోర్​సిటీలో సీవరేజీ నెట్​వర్క్ ​విస్తరిస్తాం.. వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి

కోర్​సిటీలో సీవరేజీ నెట్​వర్క్ ​విస్తరిస్తాం.. వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి

హైదరాబాద్​సిటీ, వెలుగు: మూసీ నదికి ఉత్తరాన కోర్ సిటీలో సీవరేజి వ్యవస్థను ఆధునికీకరించడంతోపాటు మరింతగా విస్తరిస్తామని మెట్రో వాటర్ బోర్డు ఎండీ అశోక్​రెడ్డి తెలిపారు. జోన్–3 సీవరేజ్​నెట్ వర్క్ ప్రాజెక్టు పనులను కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్​తో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. తొలుత టోలిచౌకి ఫ్లై ఓవర్ మెయిన్​రోడ్డుపై చేపట్టే జంక్షన్ పనులపై చర్చించారు. 

దాదాపు 8 నుంచి 11 మీటర్లు లోతులో జరిగే టన్నెలింగ్ పనులను ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రద్దీ లేని సమయాల్లో, సెలవు రోజుల్లో నిర్వహించాలని అధికారులకు సూచించారు. అక్కడి నుంచి సమీపంలోని 7 టూంబ్స్ వెళ్లే దారిలో అండర్ గ్రౌండ్ టన్నెలింగ్ పనులను పరిశీలించారు. మార్చి మొదటి వారం వరకు ఈ స్ట్రెచ్ పూర్తయ్యేలా రెండు షిఫ్టుల్లో పనులు చేపట్టాలన్నారు. 

అనంతరం ఎండీ లైన్స్, గుడిమల్కాపూర్, గిరకపల్లి తదితర ప్రాంతాల్లో పురోగతిలో ఉన్న పైపులైన్ విస్తరణ పనుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రంజాన్ మాసంలో ముస్లింలకు ఇబ్బంది కలగకుండా పనులు చేపట్టి మే వరకు పూర్తి చేయాలని ఎండీ అశోక్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.