ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం

ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : రోడ్ల ఏర్పాటుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని పంచాయతీ రాజ్‌‌ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. పంచాయతీరాజ్‌‌ శాఖ ద్వారా చేపట్టనున్న రోడ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్‌‌ మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన రోడ్ల రిపేర్‌‌ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం లక్ష్మీదేవిపేట గ్రామంలోని అంగన్‌‌వాడీ కేంద్రంలో స్టూడెంట్లకు యూనిఫామ్‌‌, ప్రీ స్కూల్‌‌ మెటీరియల్ పంపిణీ చేశారు.

 ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పంచాయతీ రాజ్‌‌ శాఖ ద్వారా రూ. 12 వేల కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మించందుకు నిర్ణయించామని, ఇందుకోసం నిధులు సైతం కేటాయించామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లను నేషనల్‌‌ హైవేలకు అనుసంధానం చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం ఉన్నప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. 

సన్న వడ్లకు రూ. 500 బోనస్‌‌ ఇచ్చామని, ఇప్పటివరకు 20 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ చేశామని, త్వరలోనే రైతు భరోసా కూడా ఇస్తామని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్‌‌ దివాకర్‌‌ టీఎస్‌‌. జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి కె.శిరీష ఉన్నారు.