ఆరు గ్యారంటీలకు నేనే గ్యారంటీ.. ఫస్ట్​ కేబినెట్​ భేటీలోనే వాటికి ఆమోద ముద్ర : రాహుల్​గాంధీ

  • ఫస్ట్​ కేబినెట్​ భేటీలోనే వాటికి  ఆమోద ముద్ర వేస్తం
  • ఆయనపై మోదీ ఎందుకు విచారణ జరిపిస్తలే
  • రాష్ట్రంలో కేసీఆర్​ను, ఢిల్లీలో మోదీని గద్దె దించుతాం
  • బీఆర్​ఎస్​, బీజేపీ, ఎంఐఎం.. మూడు పార్టీలు ఒక్కటే
  • సంగారెడ్డి, జోగిపేట, కామారెడ్డి సభల్లో వ్యాఖ్యలు

సంగారెడ్డి/కామారెడ్డి, వెలుగు: కాంగ్రెస్​ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుకు తానే గ్యారంటీ అని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడగానే ఆరు గ్యారంటీలకు మొదటి కేబినెట్​ భేటీలోనే ఆమోదముద్ర వేస్తామని స్పష్టం చేశారు.  వాటికి చట్టబద్ధత కల్పించి శాశ్వత పథకాలుగా మారుస్తామని చెప్పారు. కేసీఆర్ సర్కార్​ దోచిందంతా కక్కించి ప్రజలకు పంచుతామని వెల్లడించారు. సీఎం కేసీఆర్,​ ప్రధాని మోదీ ఒక్కటి కావడం వల్లే కేసీఆర్​ అవినీతిపై సీబీఐ, ఈడీ సోదాలు జరగడం లేదని రాహుల్​ అన్నారు. తెలంగాణలో కేసీఆర్​ను, ఢిల్లీలో మోదీని గద్దె దించుతామని చెప్పారు. 

ఆదివారం సంగారెడ్డి, జోగిపేట, కామారెడ్డి బహిరంగ సభల్లో రాహుల్​గాంధీ మాట్లాడారు. రాష్ట్ర సంపదను కేసీఆర్​ కుటుంబం దోచుకున్నదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్​ ఫ్యామిలీ లక్ష కోట్ల కుంభకోణం చేసిందని, ఆ ప్రాజెక్టు క్వాలిటీని తాను స్వయంగా పరిశీలించానని,  ప్రాజెక్టు కట్టిన కొన్నేండ్లకే పునాదులు, పిల్లర్లు దెబ్బతిన్నాయని తెలిపారు. ‘‘కేసీఆర్​ అవినీతి, అక్రమాలతో పాలన చేస్తుంటే.. మోదీ ప్రజల్లో కులమత భేదాలు సృష్టించి అధికార దాహం తీర్చుకుంటున్నరు” అని మండిపడ్డారు. ‘‘నేను మోదీకి వ్యతిరేకంగా పోరాడుతున్నానని నా మీద 24 కేసులు పెట్టారు.. 5 రోజుల పాటు రోజుకు గంటల కొద్దీ నన్ను విచారించారు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా.. కేసీఆర్, మోదీ మధ్య అంతర్గతంగా సయోధ్య కుదరకపోయుంటే ఈ పాటికి కేసీఆర్​ పీఠానికి ముప్పు వచ్చేది కదా. కేసీఆర్​ అవినీతిపై మోదీ ఎందుకు విచారణ జరిపించడం లేదు?” అని ఆయన ప్రశ్నించారు. 

ఆ మూడు పార్టీలు ఒక్కటే

బీజేపీ, బీఆర్ఎస్​, ఎంఐఎం .. ఈ మూడు పార్టీలు ఒక్కటేనని రాహుల్​ గాంధీ ఆరోపించారు.  పార్లమెంట్​లో  మోదీ ఏ చట్టాలు తీసుకొచ్చినా వాటిని కేసీఆర్ సమర్థిస్తారని,  కాంగ్రెస్​ఒక్కటే బీజేపీ, బీఆర్​ఎస్​ను గల్లీలో, ఢిల్లీలో ఓడించి అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కేసీఆర్​ అంటున్నడు. కేసీఆర్.. గుర్తుంచుకో.. నువ్వు ఏ రోడ్లమీద నడుస్తున్నవో ఆ రోడ్లను కాంగ్రెస్ వేసింది. నువ్వు చదువుకున్న స్కూళ్లు, కాలేజీలను కాంగ్రెస్సే కట్టిచ్చింది.  హైదరాబాద్​ను విశ్వనగరంగా  మార్చింది కాంగ్రెస్​ పార్టీనే’’  అని చెప్పారు. ఈ ప్రచార సభల్లో  కర్నాటక డిప్యూటీ సీఎం శివకుమార్,  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్​చార్జ్​ మాణిక్​రావ్​ ఠాక్రే, పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి, సీనియర్​ నేత కేసీ వేణుగోపాల్,  అభ్యర్థులు షబ్బీర్అలీ, ఏనుగు రవీందర్​రెడ్డి, మదన్​మోహన్​రావు, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, ఏఐసీసీ సభ్యుడు 
కుసుమ్​ కుమార్​ తదితరులు పాల్గొన్నారు. 

ఢిల్లీలో బీజేపీకి బీఆర్ఎస్​ సపోర్ట్​ చేస్తుంటే.. తెలంగాణలో బీఆర్ఎస్​కు  బీజేపీ లోపాయికారిగా మద్దతు ఇస్తున్నది. ఆ రెండు పార్టీలకు ఎంఐఎం తొత్తుగా వ్యవహరిస్తున్నది. కాంగ్రెస్​ పోటీ చేసే స్థానాల్లో బీఆర్ఎస్​ కావాలనే ఎంఐఎంను బరిలోకి దింపుతున్నది. అందుకే రాష్ట్రంలో కేసీఆర్​ ఎన్ని అవినీతి, అక్రమాలు చేసినా మోదీ మౌనంగా ఉంటున్నరు. కాంగ్రెస్​ ను ఓడించడమే బీజేపీ, బీఆర్ఎస్​ లక్ష్యంగా పెట్టుకున్నయ్​.

రాహుల్ ​గాంధీ