ఎంపీ పసునూరి దయాకర్
వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ సిటీలోని పేదలకు త్వరలోనే డబుల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేస్తామని ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. అర్హులందరికీ ఆసరా పెన్షన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. శనివారం వరంగల్ సిటీలోని 33వ డివిజన్ లో ఎమ్మెల్యే నరేందర్, కుడా చైర్మన్ సుందర్ రాజ్ తో కలిసి లబ్ధిదారులకు ఆసరా కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో పథకాలు అమలవుతున్నాయన్నారు. ప్రతిపక్షాలు కావాలనే విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు.
నెక్కొండ రూపురేఖలు మారుస్తా..
నెక్కొండ: త్వరలో నెక్కొండ మండల రూపురేఖలు మారుస్తానని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం నెక్కొండ మండలంలోని దీక్షకుంట, ముదిగొండ, చంద్రుగొండ, బంజరుపల్లి, నెక్కొండ, అలంకానిపేట, నాగారం గ్రామాల్లో కొత్త పెన్షన్ కార్డులు అందజేశారు. గిరిజన తండాలకు రూ.17 బీటీ, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.3కోట్లు సాంక్షన్ చేస్తామన్నారు. అందులో నెక్కొండ టౌన్‌కు రూ.కోటి, సెంట్రల్‌లైటింగ్ సిస్టమ్ కోసం రూ.50లక్షల నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పనిచేసే వారిని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సరోజన, ఎంపీపీ రమేశ్, మండల ప్రెసిడెంట్ సూరయ్య, చైర్మన్ రాము, లీడర్లు రమేశ్, రవీందర్ రెడ్డి, శివకుమార్, చెన్నకేశవరెడ్డి తదితరులున్నారు.
రోల్ మోడల్‌గా తెలంగాణ
రేగొండ, వెలుగు: తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో ఆసరా పెన్షన్ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ఏడునూతుల నిశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీటింగ్ లో ఎమ్మెల్యే మాట్లాడారు. రేగొండ జీపీ భవన నిర్మాణానికి రూ. 25లక్షలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.
చిన్న బస్టాండ్‌నుంచి తహసీల్దార్ ఆఫీసు వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.10లక్షలు కేటాయిస్తామని.. మండలకేంద్రంలో సులభ్‌కాంప్లెక్స్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాన కూడళ్లలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మైస సుమలత, ఎంపీపీ పున్నం లక్ష్మి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అంకం రాజేందర్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు దాసరి నారాయణరెడ్డి, నాయకులు జూపాక నీలాంబ్రం, మోడెం ఉమేష్‌గౌడ్, మైస భిక్షపతి, బండి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్సవ విగ్రహాల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: రాష్ట్రంలో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలుగా మారారని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోతు హుస్సేన్‌నాయక్ ఆరోపించారు. మహబూబాబాద్ నియోజకవర్గంలోని చేపట్టిన ప్రజాగోస– -బీజేపీ భరోసా యాత్ర శనివారం ముగియగా.. చివరిరోజైన శనివారం మహబూబాబాద్ పట్టణంలో బైక్ ర్యాలీ తీశారు. స్థానిక నందన గార్డెన్ నుంచి తహసీల్దార్ ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించి, ప్రజా సమస్యలు తెలుసుకున్నారు.
ఈ యాత్రపై టీఆర్ఎస్ కుట్ర పన్ని బీజేపీ గద్దెలు ధ్వంసం చేశారని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. పోలీసులు గులాబీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పని అయిపోయిందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఇన్ చార్జి, రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఒద్దిరాజు రాంచందర్‌రావు, యాప సీతయ్య, ఎర్రంరెడ్డి సిద్దార్ధ్ రెడ్డి, మొసంగి మురళి, సిరికొండ సంపత్, నవీన్‌కుమార్, ప్రేమ్రాయుడు తదితరులున్నారు.
ట్రైబల్ వర్సిటీని ప్రారంభించాలి
వెంకటాపూర్(ములుగు), వెలుగు: ములుగు జిల్లాకు మంజూరైన ట్రైబల్ వర్సిటీని ప్రారంభించేలా చొరవ తీసుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను ఎమ్మెల్యే సీతక్క కోరారు. ఈమేరకు శనివారం హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఎనిమిదేండ్లు గడిచినా.. యూనివర్సిటీని ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టం ప్రకారం విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కనీసం తాత్కాలిక తరగతులు కూడా ప్రారంభించకపోవడం దారుణమన్నారు. పక్క రాష్ట్రంలో ఎప్పుడో ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు.
తూర్పులో విజయం బీజేపీదే
వరంగల్‌సిటీ, వెలుగు: రాబోయే ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరేస్తామని ఆ పార్టీ లీడర్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు ధీమా వ్యక్తం చేశారు. శనివారం 39వ డివిజన్ కు చెందిన దాదాపు 100మంది బీజేపీలో చేరగా.. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ప్రదీప్ రావు మాట్లాడుతూ.. ఉద్యమ ఆశయాలను కేసీఆర్ తుంగలో తొక్కారన్నారు. ఇచ్చిన హామీలు మరిచి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని దుయ్యబట్టారు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో వరంగల్
పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ అల్లం నాగరాజు, ఆకారపు మోహన్, తాబేటి వెంకన్న, డివిజన్ అధ్యక్షులు మాచర్ల రవీందర్, పాక సుధాకర్, సంగని జగదీశ్వర్, కోటేశ్వర్ రావు, మంద శ్రీను, కందిమల్ల మహేశ్, నయనేశ్ తదితరులు పాల్గొన్నారు.
పేదింటి మహిళల పెద్దన్న కేసీఆర్
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
వెలుగు నెట్ వర్క్: సీఎం కేసీఆర్ పేదింటి మహిళలకు పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం జనగామ జిల్లా దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, పెద్ద వంగర మండలాల్లో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమైక్య రాష్ర్టంలో గుర్తించని తెలంగాణ పండుగలకు.. ప్రత్యేక రాష్ట్రంలో ఎంతో గుర్తింపు దక్కుతోందన్నారు. ఈ ఏడాది 24 డిజైన్లు, 10 రకాల కలర్లతో బతుకమ్మ చీరలు తయారు చేయించామన్నారు. వీటి కోసం ప్రభుత్వం రూ.339.73కోట్లు ఖర్చు చేసిందన్నారు.
కొనసాగుతున్న పంపిణీ..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగుతోంది. జనగామ జిల్లా బచ్చన్నపేట, నర్మెట మండలాల్లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి బతుకమ్మ చీరలు పంచారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్, వేలేరు మండలాల్లో ఎమ్మెల్యే రాజయ్య చీరలు పంపిణీ చేశారు.
డబుల్ ఇంజన్ సర్కారుతోనే సంక్షేమం
సెంట్రల్ మినిస్టర్ బీఎల్ వర్మ
స్టేషన్‌ఘన్ పూర్, రఘునాథపల్లి, వెలుగు: డబుల్ ఇంజన్ సర్కారుతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, సహకార సహాయ మంత్రి బీఎల్ వర్మ అన్నారు. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లిస్తోందని ఆరోపించారు. శనివారం లోక్ సభ ప్రవాస్ యోజనలో భాగంగా జనగామ జిల్లా లింగాల ఘనపూర్, స్టేషన్ ఘన్ పూర్, చిల్పూర్ మండలాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర పథకాలను ప్రజలకు అమలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఏ ఒక్క పథకాన్ని అమలు చేయకుండా నిధులు జేబులో వేసుకుంటున్నాడని ఆరోపించారు. కేంద్ర పథకాలకు.. సొంత పేర్లు పెట్టి, కేసీఆర్ పబ్బం గడుపుకొంటున్నారని మండిపడ్డారు. నీతివంతమైన పాలనకు కేరాఫ్ అడ్రస్ మోడీ ప్రభుత్వమేనన్నారు. కార్యక్రమంలో బీజేపీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ యుగేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, మాజీ మంత్రి డా.గుండె విజయరామారావు, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, జనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్‌రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ కన్వీనర్ అయిలోని అంజిరెడ్డి, రాష్ట్ర నాయకులు పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, బొజ్జపల్లి సుభాశ్, చిలుక విజయరావు, గట్టు క్రిష్ణ, పెండ్యాల దిలీప్, ఇనుగాల కార్తీక్‌రెడ్డి తదితరులున్నారు.
‘ఆకాంక్ష’ జిల్లాలను అభివృద్ధి చేస్తాం
ఆఫీసర్లు సహకరించాలి
నీతి అయోగ్ అడిషనల్ సెక్రటరీ సంజయ్ కుమార్
వెంకటాపూర్ (ములుగు), వెలుగు: వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ‘ఆకాంక్ష జిల్లాల‘ పేరుతో ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది. ఉమ్మడి జిల్లాలో భూపాలపల్లి, ములుగు జిల్లాలు ఈ పథకానికి ఎంపిక కాగా.. దీనిపై శనివారం నీతి అయోగ్ అడిషనల్ సెక్రటరీ సంజయ్ కుమార్ రివ్యూ చేశారు. భూపాలపల్లి కలెక్టరేట్ లో కలెక్టర్లు కృష్ణ ఆదిత్య, భవేశ్ మిశ్రా, ఐటీడీఏ పీవో అంకిత్, ఇతర ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఆకాంక్ష పథకంలో భాగంగా విద్య, వైద్యం, పౌష్టికాహారం, వ్యవసాయం, నీటి వనరులు, నైపుణ్య అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామన్నారు.
ఇరు జిల్లాలోని 234 అంగన్ వాడీల అభివృద్ధికి రూ.10కోట్లు, విద్యా ప్రమాణాల పెంపు కోసం రూ.10.51కోట్లు, వైద్యానికి రూ.8.74కోట్లు కేటాయించామన్నారు. చిరుధాన్యాల ప్రాజెక్టు కోసం రూ.1.36 కోట్లతో పాటు 500 ఎకరాల గుర్తించామన్నారు. ఇందులో జరిగే పనులు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ చేయాలని, గతంలో చేయకపోవడం వల్ల ర్యాంకు దిగజారిందన్నారు. వివిధ శాఖల ఆఫీసర్లు సమన్వయంతో పనిచేయాలని, అవసరమైతే సూపర్ వైజర్లను నియమించాలన్నారు. అనంతరం రామప్ప టెంపుల్ ను సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు వైవీ గణేశ్, దివాకర్, డీఆర్వోకే రమాదేవి ఇతర ఆఫీసర్లు ఉన్నారు.
భూదందాలు ఆపకపోతే ఊరుకునేది లేదు
కాంగ్రెస్ లీడర్లు
నర్సంపేట, వెలుగు: నర్సంపేట టౌన్లో కొంత మంది అధికార పార్టీ లీడర్లు చేస్తున్న భూదందాలను వెంటనే ఆపాలని, లేకపోతే ఊరుకోమని కాంగ్రెస్ లీడర్లు హెచ్చరించారు. టౌన్‌లోని గెస్ట్ హౌజ్‌లో శనివారం పీసీసీ మెంబర్ పెండెం రామానంద్, నియోజకవర్గ కన్వీనర్ రవీందర్రావు, టౌన్ ప్రెసిడెంట్ రాజేందర్, బీసీ సెల్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, మున్సిపల్ఫ్లోర్లీడర్ సాంబయ్య మీడియాతో మాట్లాడారు. జాలుబంధం కాలువను ఇప్పటికే రెండుసార్లు కబ్జా చేశారన్నారు. తమ పట్ల ఓ లీడర్ అనుచితంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. నమ్మిన నాయకుడి కోసం, పార్టీ కోసం నిరంతరం కష్టపడి ప్రజల పక్షాన పోరాడుతున్నామని స్పష్టం చేశారు. కౌన్సిలర్లు విజయ్‌కుమార్, ములుకల వినోద, లీడర్లు సాంబయ్య, వెంకన్న, నర్సింహారెడ్డి, రమేశ్, నగేశ్, శ్రీనివాస్, మురళీ, వంశీకృష్ణ పాల్గొన్నారు.
ముప్పారంలో అక్రమ మైనింగ్?
ఇద్దరు అక్రమార్కులకు నోటీసులు
ధర్మసాగర్, వెలుగు: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్టు ఆఫీసర్లు నిర్ధారించినట్లు తెలిసింది. మైనింగ్ పర్మిషన్ తీసుకుని పక్కనే ఉన్న ల్యాండ్‌లో తవ్వకాలు చేస్తున్నట్లు గ్రామస్తుడొకరు ఆగస్టులో ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం రెవెన్యూ, మైనింగ్ ఆఫీసర్లు జాయింట్ సర్వే చేశారు. అక్రమాలు జరిగినట్లు గుర్తించి, ఇద్దరు వ్యక్తులకు నోటీసులు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే విషయమై ఆఫీసర్లను వివరణ కోరగా సమాధానం దాటేశారు.
ఉత్సవ విగ్రహాల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: రాష్ట్రంలో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలుగా మారారని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోతు హుస్సేన్‌నాయక్ ఆరోపించారు. మహబూబాబాద్ నియోజకవర్గంలోని చేపట్టిన ప్రజాగోస– -బీజేపీ భరోసా యాత్ర శనివారం ముగియగా.. చివరిరోజైన శనివారం మహబూబాబాద్ పట్టణంలో బైక్ ర్యాలీ తీశారు. స్థానిక నందన గార్డెన్ నుంచి తహసీల్దార్ ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించి, ప్రజా సమస్యలు తెలుసుకున్నారు.
ఈ యాత్రపై టీఆర్ఎస్ కుట్ర పన్ని బీజేపీ గద్దెలు ధ్వంసం చేశారని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. పోలీసులు గులాబీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పని అయిపోయిందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఇన్ చార్జి, రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఒద్దిరాజు రాంచందర్‌రావు, యాప సీతయ్య, ఎర్రంరెడ్డి సిద్దార్ధ్ రెడ్డి, మొసంగి మురళి, సిరికొండ సంపత్, నవీన్‌కుమార్, ప్రేమ్రాయుడు తదితరులున్నారు.
పనుల్లో ఇంత నిర్లక్ష్యమా?
నెక్కొండ, వెలుగు: అభివృద్ధి పనుల్లో ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేస్తున్నారని నెక్కొండ కాంగ్రెస్ లీడర్లు మండిపడ్డారు. నెక్కొండ రైల్వేస్టేషన్ నుంచి వట్టేవాగు వరకు రోడ్డు వెడల్పు పనులు స్లోగా సాగడంపై శనివారం నిరసన తెలిపారు. పనులు ప్రారంభించి ఆరు నెలలు దాటినా నేటి వరకూ పూర్తి చేయలేదన్నారు. దీంతో వాహనదారులు, షాపుల ఓనర్లు, పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పెద్ది నిర్లక్ష్యంతోనే పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆరోపించారు. పనులు వెంటనే పూర్తి చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షులు బక్కి అశోక్, జిల్లా కార్యదర్శి హరీశ్‌రెడ్డి, పట్టణ అధ్యక్షులు హరిప్రసాద్, నాయకులు మైపాల్ రెడ్డి, ప్రశాంత్, భానుప్రకాశ్ తదితరులున్నారు.