ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నిక ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ హరిద్వార్, ఉధమ్‌సింగ్ నగర్‌లలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాఖండ్ ప్రజలకు నాలుగు హామీలు ఇస్తున్నట్లు చెప్పారు. ‘‘మా పార్టీని గెలిపిస్తే నాలుగు లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తాం. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.500 కంటే తక్కువకే వచ్చేలా చేస్తాం. న్యాయ్ స్కీమ్‌ను అమలు చేస్తాం. ఈ పథకం ద్వారా ఐదు లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ఇంటి వద్దకే వైద్య సాయం అందేలా మార్పులు చేస్తాం” అని రాహుల్ గాంధీ చెప్పారు. తమ పార్టీ ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తుందని ఆయన అన్నారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌లలో రైతులకు రుణ మాఫీ చేస్తామని వాగ్దానం చేశామని, చెప్పినట్టే ఆ హామీని అమలు చేశామని తెలిపారు.
Uttarakhand | We are making 4 promises to you. We will give employment to 4 lakh people. We will give LPG cylinder less than Rs 500. We will also implement 'Nyay' scheme here, in which 5 lakh families will be given Rs 40,000 in a year: Congress leader Rahul Gandhi in Haridwar pic.twitter.com/dnrAcyJIq2
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 5, 2022
మోడీ ప్రధాని కాదు.. రాజు
ఉధమ్ సింగ్ నగర్ ప్రచారంలో మాట్లాడుతూ రాహుల్.. ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు. గతంలో భారత్‌ను ప్రధాన మంత్రి పాలించే వారని, ఇప్పుడు రాజు పాలిస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు. ఎవరితో సంప్రదింపులు జరపడం, వారు చెప్పేవి వినడం లాంటివి లేకుండా నిర్ణయాలు తీసుకుని పాలన చేస్తున్నారని అన్నారు. ప్రధాన మంత్రి అంటే అందరి కోసం పని చేయాలని, ప్రజలు చెప్పేది వినాలని అన్నారు. అయితే నరేంద్ర మోడీజీ ప్రధాన మంత్రి కాదని, ఆయన ఒక రాజు అని అన్నారు. ఆయన రైతులను పూర్తిగా పట్టించుకోకుండా వదిలేశారని, ఎందుకంటే రాజు.. పేదలు, కష్ట జీవులతో మాట్లాడరని, వారు చెప్పేది వినరని, రాజులు వాళ్ల కోసం కూడా తమ సొంత నిర్ణయాలు తీసేసుకుని అమలు చేస్తారని రాహుల్ గాంధీ అన్నారు.