రానున్న నెల రోజుల్లో పోడు భూములకు పట్టాలు అందిస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక గిరిజనులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు. తెలంగాణ బంజారా ఎంప్లాయిస్ సేవా సంఘ్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. గిరిజన రిజర్వేషన్లను 10శాతం పెంచిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ గిరిజనులను మోసం చేసిందని విమర్శించారు.
రాష్ట్రంలోని 2475 తండాలను గ్రామపంచాయతీలుగా మార్చామని హరీష్ రావు తెలిపారు. నూతన గ్రామపంచాయతీలలో జీపీ భవనాల నిర్మాణాలకు 450 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. ఉద్యోగాల నియామకాల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను అందిస్తున్నట్లు చెప్పారు. పటాన్చెరు నియోజకవర్గంలో వెయ్యి గజాల్లో బంజారా భవన్ నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఉమ్మడి ఏపీలో గిరిజన విద్యార్థుల కోసం ఒక కాలేజీ లేదని.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 75 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశామన్నారు. కేంద్రం రిజర్వేషన్లను ఎత్తేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.గిరిజనుల ఆరాధ్య దైవమైన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.