మూడు రోజుల్లో బిల్స్ ఇయ్యకుంటే కాంట్రాక్టర్లు సమ్మెకు సై
బిల్లుల కోసం 4 నెలలుగా వెయిటింగ్
సుమారు రూ. 260 కోట్లు పెండింగ్
హెడ్డా ఫీసుకు వెళ్తే అధికారులు కలుస్తలే
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీలోని సివిల్కాంట్రాక్టర్లు సమ్మెకు సై అంటున్నారు. నాలుగు నెలలుగా చేసిన పనులకు బిల్లులు ఆగిపోవడంతో ఇప్పటికే జోనల్ఆఫీసుల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మూడ్రోజుల్లోగా బిల్లులు ఇవ్వకుంటే ఎక్కడికక్కడ పనులు నిలిపి వేసి సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. బల్దియా పరిధిలో ఈ ఏడాది ఆగస్ట్నుంచి ఇప్పటివరకు రూ.260 కోట్ల వరకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు చేసిన పనులకు చెల్లించకుండా, కొత్త పనులకు టెండర్లు పిలవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బల్దియాలో దాదాపు 2వేల మంది సివిల్కాంట్రాక్టర్లు ఉండగా, ఇందులో రెగ్యూలర్ గా 600 మంది ఉన్నారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న బిల్లుల్లో 250మంది కాంట్రాక్టర్లకు రావాల్సి ఉంది. సిటీలో వరదల కారణంగా డ్యామేజ్అయిన రోడ్ల మరమ్మతుల పనులు చాలా ప్రాంతాల్లో ఇంకా పూర్తికాలేదు. నెల నెలా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తేనే మెయింటెనెన్స్పనులు త్వరగా పూర్తిచేస్తారు. మొత్తానికే ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తే పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఇంట్రస్ట్ చూపరు. ఇప్పటికే సిటీలో చాలా చోట్ల చిన్నచిన్న పనులు ముందుకు సాగడంలేదు. అప్పులు తెచ్చి పనులను పూర్తి చేస్తున్నా బిల్లులు ఇవ్వడం లేదని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హెడ్డాఫీసుకు వెళ్తే అడ్డుకొని..
జీహెచ్‌ఎంసీ హెడ్డాఫీసులోకి కాంట్రాక్టర్లు వెళ్తే చాలు.. వాళ్లను చూస్తే అధికారులు వామ్మో అంటున్నారు. వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక కలవకుండా అడ్డుకోమని అటెండర్లకు ఆర్డర్లు ఇస్తున్నారు. ఆఫీసులోకి ఎవరు వచ్చినా ముందుగా వారిని అన్ని వివరాలు అడిగి ఆతర్వాతనే లోపలికి పంపిస్తున్నారు. అధికారుల ఆదేశాలు ఉండడంతోనే ఇలా చేస్తున్నామని అటెండర్లు చెప్తున్నారు. కరోనా, వరదలు, ఎన్నికల కారణంగా బల్దియాకు ఆదాయం తగ్గడంతోనే కాంట్రాక్టర్లకు బిల్లులు అందించలేకపోతున్నామని జీహెచ్ఎంసీలోని ఓ సీనియర్ అధికారి చెప్పారు. ఫండ్స్రిలీజ్ అయితే వెంటనే అందరికీ బిల్లులు చెల్లిస్తామని పేర్కొన్నారు. గతంలో కాంట్రాక్టర్లకు టైమ్‌కు బిల్లులు ఇచ్చామని, ఇప్పుడున్న పరిస్థితులతోనే వాటిని ఆపాల్సి వస్తుందని చెప్పారు.
అప్పులు తెచ్చి ఇబ్బందులు పడుతున్నం
మూడ్రోజుల్లోగా ఇస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. అంతలోపు బిల్లులు చెల్లించకపోతే పనులు నిలిపి సమ్మెకు దిగుతాం. ఇప్పటికే జోనల్ వారీగా పనులు ఆపేసి ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తున్నాం. అప్పులు తెచ్చి పనులు చేస్తుండగా టైమ్‌కు బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం .
– దామోదర్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
For More News..