
సిద్దిపేట, వెలుగు : ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపిస్తామని, గతంలో చెప్పినట్టుగానే ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలుండవని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం మంథని నియోజకవర్గ పర్యటనకు వెళ్తూ సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో అన్ని పార్టీలను కలుపుకుని ముందుకు పోవాలని సీఎం సూచించారని, ఉపాధి, ఉద్యోగ, పరిశ్రమలు, ఐటీ రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిపేలా ప్లాన్లు రూపొందిస్తున్నట్టు తెలిపారు.
గత ప్రభుత్వానికి సంబంధించిన పాలసీలు ఏవైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే మరింత వేగంగా అమలు చేసే ప్రయత్నం చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రజలకు హామీ ఇచ్చినట్టు ఆరు గ్యారంటీలతో పాటు మేనిఫెస్టో అంశాలు, ఆటో డ్రైవర్లతో పాటు అన్ని వర్గాల సంక్షేమం కోసం బడ్జెట్ కు రూపకల్పన చేస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ అమలు చేసి ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు.