- మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి
సూర్యాపేట, వెలుగు : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపిస్తామని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేటలో నియోజకవర్గ పోలింగ్ బూత్ ఏజెంట్లు, ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పేదల భూములను ఆ పార్టీ నాయకులు కబ్జా చేశారని, దీనిపై విచారణ జరిపి పేదలకు భూములు పంచుతామన్నారు. విద్యుత్ శాఖ మంత్రిగా జగదీశ్ రెడ్డి జిల్లాకు చేసిందేమీలేదన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎస్సారెస్పీ రెండో దశ పూర్తి చేసి సూర్యాపేటకు గోదావరి జలాలు తీసుకొస్తే ఆ నీళ్లకు జగదీశ్ రెడ్డి పసుపు, కుంకుమ చల్లి పూజలు చేశారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలువబోతున్నారని తెలిపారు. సమావేశంలో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి, రాష్ట్ర నాయకుడు కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు, పీసీసీ ప్రతినిధి అన్నెపర్తి జ్ఞానసుందర్, మాజీ ఎమ్మెల్యే గోపాల్, కౌన్సిలర్లుపాల్గొన్నారు.