సీఎం కేసీఆర్ పై, బీఆర్ఎస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రజలంతా బీజేపీ వైపే చూస్తున్నారని ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ లో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మెకు సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లితో సహా మోడీ నాయకత్వాన్ని, బీజేపీ విధానాలు నచ్చి ఎవరొచ్చినా పార్టీలోకి ఆహ్వానిస్తామని తెలిపారు.
ఖమ్మంలో పొంగులేటితో ఈటల బృందం చర్చలు జరుపుతున్న సంగతి తనకు తెలియదని బండి సంజయ్ చెప్పారు. పార్టీలో అన్ని తనకు తెలిసి జరగాల్సిన పనిలేదన్నారు. పార్టీలో ఎవరి పని వాళ్లు చేసుకుంటారని, అన్నీ తాను ఒక్కడినే చేయాలనుకోవడం సరికాదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారని, అందుకే బీజేపీ వైపు ఉండాలని ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సింగిల్ గానే పోటీ చేసి అధికారంలోకి వస్తుందని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.
మే 04 గురువారం మధ్యాహ్నం పొంగులేటి తన నివాసంలో బీజేపీ చేరికల కమిటీతో సమావేశం కానున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటితో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పొంగులేటితో చర్చించి తమ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. దీంతో పొంగులేటి పార్టీ మార్పుపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.