- జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
సికింద్రాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చెప్పారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. శుక్రవారం సికింద్రాబాద్ జోనల్ ఆఫీస్వద్ద ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఏర్పాటు చేసిన క్యాంటీన్ ను ఆమె ప్రారంభించారు. సొంత వ్యాపారంతో ఆర్థికంగా ఎదగవచ్చు అని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు సహాయపడతాయన్నారు.
జీహెచ్ఎంసీ వ్యాప్తంగా మరిన్ని క్యాంటీన్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మొదటి క్యాంటీన్ ను ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం మేయర్ సంగీత్ జంక్షన్, వైఎంసీఏ వద్ద రూ.38.51లక్షలతో కొత్తగా ఏర్పాటు చేసిన స్ట్రీట్లైట్లను ప్రారంభించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్, జోనల్ కమిషనర్ రవికిరణ్, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.