
గోదావరిఖని, వెలుగు : సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాల అమలుకు ఉద్యమాలు చేస్తామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని భాస్కర్ రావు భవన్లో గురువారం ఏఐటీయూసీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు కోల్ ఇండియాలో అమలు చేస్తున్న హై పవర్ కమిటీ వేతనాలు ఇవ్వడంలేదన్నారు.
సివిక్, ఇతర విభాగాల్లోని కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాల చట్టం అమలుకు రాష్ట్ర ప్రభుత్వ జీవో 22 పై ఒత్తిడి పెంచేందుకు ఏఐటీయూసీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. సింగరేణిలో దాదాపు 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పర్మినెంట్ కార్మికులతో సమానంగా పని చేస్తున్నారని, చట్ట ప్రకారం వేతనాలు చెల్లించకుండా సింగరేణి మేనేజ్మెంట్ శ్రమ దోపిడీ చేస్తుందని ఆరోపించారు. ఈ మీటింగ్లో యూనియన్ లీడర్లు మడ్డి ఎల్లాగౌడ్, కవ్వంపల్లి స్వామి, ఆరెల్లి పోషం, ఎం.ఎ.గౌస్, కన్నం లక్ష్మి నారాయణ, పడాల కనకరాజు, సిరిసిల్ల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.