ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
  • గురుకుల హాస్టల్ ​ముందు విద్యార్థుల ఆందోళన
  • సౌకర్యాలు లేవంటూ ఆగ్రహం

కరీంనగర్ సిటీ, వెలుగు: జిల్లా కేంద్రంలోని  జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల విద్యార్థులను తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ స్కూల్ కు మారుస్తూ మంగళవారం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే  అధికారులు తీసుకున్న నిర్ణయంపై స్టూడెంట్లు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్కూలు ఎదుట ఆందోళన చేపట్టారు. ఎల్ఎండీ కాలనీ జ్యోతిబా స్కూల్ ప్రాంగణమంతా చెట్లు, పొదలతో అడవిగా ఉంటుందని,  పాములు, తేళ్లు తిరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆరోపించారు. కొత్తగా అడ్మిషన్లు తీసుకున్న వారికోసం పాత విద్యార్థులను మరో చోటికి పంపించడం ఏంటని ప్రశ్నించారు. సమస్య పరిష్కరించకపోతే పిల్లల టీసీలు తీసుకొని వెళ్లిపోతామని హెచ్చరించారు. కాగా మంగళవారం రాత్రి అధికారులు పాఠశాలకు సంబంధించిన సామాగ్రిని వ్యాన్ లో  తరలించారు. 

మెడిక‌‌వ‌‌ర్‌‌’లో ఆప‌‌రేష‌‌న్ థియేట‌‌ర్‌‌ ప్రారంభం

కరీంనగర్ సిటీ, వెలుగు: స్థానిక మెడిక‌‌వ‌‌ర్ ఆసుప‌‌త్రిలో స‌‌ర్జరీల కోసం అంత‌‌ర్జాతీయ ప్రమాణాలతో ఆప‌‌రేష‌‌న్ థియేట‌‌ర్ల కాంప్లెక్స్, ఆధునిక ఐసీయూ విభాగాల‌‌ను మంగళవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి హాజరైన మెడిక‌‌వ‌‌ర్ గ్రూప్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ​హ‌‌రికృష్ణ మాట్లాడుతూ ప్రజలకు అంత‌‌ర్జాతీయ‌‌స్థాయి వైద్యం అందుబాటులోకి తీసుకువ‌‌చ్చామ‌‌ని అన్నారు. కార్యక్రమంలో మెడిక‌‌వ‌‌ర్ గ్రూప్ సీఓఓ జాన్‌‌ స్టబ్బింగ్‌‌ స్టన్, సీఎఫ్‌‌ఓ జోర్యాన్‌‌, క్లస్టర్ హెడ్ మేఘా, క‌‌రీంన‌‌గ‌‌ర్ సెంట‌‌ర్‌‌హెడ్ గుర్రం కిర‌‌ణ్‌‌, వైద్యులు పాల్గొన్నారు. 

గ్రూప్-1 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి

రాజన్న సిరిసిల్ల, వెలుగు : అక్టోబర్​16 న జరుగనున్న గ్రూప్- 1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. పరీక్ష ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రిలిమ్స్ కు జిల్లాలోని 4,266 మంది హాజరవుతారని, జిల్లాలో 17 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షకు సంబంధించి సమస్యలు ఉంటే కంట్రోల్ రూం నంబర్​93986 84240 కు ఫోన్ చేయాలన్నారు. రైటింగ్ ప్యాడ్ లకు అనుమతి లేదని, ప్రశ్న పత్రాలను పంపిణీని సీసీ కెమెరాల ద్వారా, అవి లేనిచోట వీడియో కెమెరాలతో రికార్డు చేయాలని అన్నారు. చీఫ్ సూపరింటెండెంట్​కు తప్ప ఎవరికీ మొబైల్ ఫోన్లకు అనుమతి లేదన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఆర్డీఓలు శ్రీనివాస్ రావు, పవన్ కుమార్, డీఈఓ రాధా కిషన్, లైజనింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మృతుల కుటుంబాలకు ఎంపీ పరామర్శ 

మెట్ పల్లి, వెలుగు : కోరుట్ల నియోజకవర్గంలో ఇటీవల చనిపోయిన మృతుల కుటుంబాలను నిజామాబాద్ ఎంపీ డి. అరవింద్ పరామర్శించారు. మంగళవారం మెట్ పల్లి బీజేపీ సీనియర్ లీడర్​ఎం.కృష్ణమూర్తి కుమారుడు గుండెపోటుతో చనిపోయాడు. వారి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రముఖ వ్యాపారవేత్త గుంటుక విష్ణు అన్న రాజగోపాల్ చనిపోగా వారి కుటుంబాన్ని, మండలంలోని జగ్గసాగర్ కు చెందిన బీజేపీ కార్యకర్త డబ్బ రాజ్ పాల్ రెడ్డి భార్య లావణ్య అనారోగ్యంతో చనిపోగా వారి కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఎంపీ వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, పట్టణాధ్యక్షుడు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

వృద్ధ దంపతులకు ఎస్పీ చేయూత

తంగళ్లపల్లి, వెలుగు: ఓ వృద్ధ దంపతులకు జిల్లా ఎస్పీ రాహుల్​హెగ్డే అండగా నిలిచారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లికి చెందిన సత్తు వజ్రవ్వ, -చంద్రయ్య అనే వృద్ధ దంపతులు కొన్ని రోజుల క్రితం తమ బంగారు గోలుసు పోగొట్టుకున్నారు. ఎంత వెతికినా దొరకకపోవడంతో విషయాన్ని స్థానికులు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. చలించిపోయిన జిల్లా ఎస్పీ వెంటనే బాధ పడకండి సొంత ఖర్చులతో చైన్ చేయిస్తానని హామీ ఇచ్చారు. మంగళవారం ఎస్పీ ఆఫీస్​లో  వజ్రవ్వ -చంద్రయ్యకు తులం బంగారు చైన్ అందించారు. ఈ సందర్భంగా దంపతులు రాహుల్​కు కృతజ్ఞతలు తెలిపారు.

బీఆర్ఎస్ తో వైసీపీకే నష్టం

వేములవాడ, వెలుగు: బీఆర్ఎస్ పార్టీతో ఆంధ్రప్రదేశ్ లోని జగన్ పార్టీకే నష్టమని, జనసేనపై ఎలాంటి ప్రభావం ఉండదని ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ లీడర్​బలిరెడ్డి పృథ్వీరాజ్ అన్నారు. మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ రాజరాజేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడారు. రాజన్నను దర్శించుకోవడం మొదటిసారని అన్నారు. వైసీపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, ప్రజలు ప్రభుత్వం మార్పు కోరుకుంటున్నారని అన్నారు.

డబుల్​ ఇండ్ల ఆక్రమణకు మహిళల యత్నం

అడ్డుకున్న పోలీసులు

పెద్దపల్లి, వెలుగు: డబుల్ బెడ్​రూం ఇండ్ల నిర్మాణం పూర్తయినా పంపిణీ చేయకపోవడంతో మంగళవారం స్థానిక టీఆర్ఎస్ మహిళా లీడర్లు వాటిని ఆక్రమించే ప్రయత్నం చేశారు. పెద్దపల్లిలో ఆరు నెలల క్రితమే డబుల్​ బెడ్ రూం ఇండ్లు పూర్తయ్యాయి. దీంతో నిర్మాణం పూర్తయిన ఇండ్ల తాళాలు పగులగొట్టిన మహిళలు ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మహిళలను పంపించేశారు. ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకుని ఏండ్ల తరబడి ఎదురు చూస్తున్నామని, వెంటనే అర్హులకు పంపిణీ చేయాలని మహిళలు డిమాండ్​ చేశారు.. 

వీఆర్ఏల ముందస్తు అరెస్టు

పెద్దపల్లి, వెలుగు: హోం మినిస్టర్ మహమూద్ అలీ పర్యటన సందర్భంగా మంగళవారం జిల్లావ్యాప్తంగా వీఆర్ఏలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు. 75 రోజులుగా తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్నారు. సుల్తానాబాద్, మంథని, ముత్తారం, రామగిరి మండలాల వీఆర్ఏలను అదుపులోకి తీసుకొని సాయంత్రం వదిలేశారు. 

వేములవాడ:  హైదరాబాద్ లో జరిగే వీఆర్ఏ మహిళా గర్జనకు వెళ్లకుండా వేములవాడ వీఆర్ఏలను మంగళవారం పోలీస్​స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా వీఆర్ఏల జేఏసీ జి ల్లా కార్యదర్శి అర్జున్​మాట్లాడారు. సీ ఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అరెస్టు చేయడం సరికాదని అన్నారు. 

సర్దార్ సత్రం ప్రజల ఆస్తి 

జగిత్యాల, వెలుగు: జగిత్యాల టవర్ సర్కిల్ ప్రాంతంలోని సర్దార్ సత్రం ప్రజలందరి ఆస్తి అని, ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందిందని కాదని సీపీఐ జిల్లా కార్యదర్శి వి.సురేశ్​అన్నారు. మంగళవారం జగిత్యాల  ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొందరు బడా వ్యాపారులు, లీడర్లు ఒక వర్గంగా ఏర్పడి వైశ్యులకు సత్రాన్ని కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసి సర్ధార్ వల్లభ్​భాయ్ పటేల్ సత్రాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కన్వీనర్ శ్రీనివాస్, ఏఐటీయూసీ నాయకులు కిరణ్ పాల్గొన్నారు.

బల్దియా కమిషనర్ సమ్మయ్య బదిలీ

మెట్ పల్లి, వెలుగు : స్థానిక బల్దియా కమిషనర్ సల్వాజి సమ్మయ్యను హుజూరాబాద్ కమిషనర్ గా బదిలీ చేస్తూ సీడీఎంఏ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సమ్మయ్య 8 ఏప్రిల్ 2021 లో మెట్ పల్లి బల్దియా కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. 

అడిషనల్ కమిషనర్ గా స్వరూపారాణి

కరీంనగర్ కార్పొరేషన్, వెలుగు: నగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్ గా స్వరూపారాణి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ లో డిప్యూటీ కమిషనర్ గా పనిచేసిన ఆమె బదిలీపై కరీంనగర్ వచ్చారు. గతంలో స్వరూపారాణి కరీంనగర్ నగరపాలక సంస్థలో డిప్యూటీ కమిషనర్ గా విధులు నిర్వహించారు.

బాలికల చదువుతోనే సమానత్వం

కరీంనగర్ సిటీ, వెలుగు: బాలికలు చదువుతోనే సమాజంలో సమానత్వం సాధిస్తారని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన అంతర్జాతీయ బాలికల దినోత్సవ వేడుకలో ఆమె మాట్లాడారు. మహిళల సమానత్వం కోసం ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు. కల్యాణలక్ష్మి ద్వారా బాల్యవివాహాలు చాలా వరకు తగ్గాయని తెలిపారు. అనంతరం వివిధ రంగాలలో ప్రతిభ చూపిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ కర్ణన్, అడిషనల్​కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా సంక్షేమ అధికారి సబితా కుమారి తదితరులు  పాల్గొన్నారు.

‘కాంట్రాక్టును వెంటనే రద్దు చేయాలి’

చొప్పదండి,వెలుగు: స్థానిక మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్ పనులు దక్కించుకున్న అయ్యప్ప కన్​స్ట్రక్షన్ కాంట్రాక్టును వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్​రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ గతంలో ఈ కంపెనీ మండల కేంద్రం నుంచి పాత వెదురుగట్ట రోడ్డు నిర్మాణం చేపట్టిందని, నాణ్యత ప్రమాణాలు లేక కొద్ది రోజుల్లోనే రోడ్డు ధ్వంసమైందన్నారు. ఎమ్మెల్యే రవిశంకర్ కు కమీషన్లు ఇచ్చి  కాంట్రాక్టులన్ని దక్కించుకుంటున్నారని ఆరోపించారు.

‘బండిని విమర్శించే అర్హత ఎమ్మెల్యేకు లేదు’

పెద్దపల్లి, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్​ని విమర్శించే అర్హత ఎమ్మెల్యే రవిశంకర్​కు లేదని బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కాడే సూర్యనారాయణ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో మంగళవారం ఆయన మాట్లాడారు. బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక విమర్శలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రమంతా దళిత బంధు అమలు చేస్తామన్న కేసీఆర్​ను నిలదీయకుండా, ప్రభుత్వంపై ఒత్తిడి చేసే ప్రతిపక్ష నాయకులను విమర్శించడం సరైంది కాదన్నారు. సమావేశంలో నాయకులు శ్రీనివాస్, మల్లేశం, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు .

పెంచిన కూలి రేట్లు అమలు చేయాలి

కలెక్టరేట్​ ముందు కార్మికుల ధర్నా

కరీంనగర్ సిటీ, వెలుగు : తమకు ఉపాధి కల్పించి అడ్డా కూలి రేట్లు అమలు చేయాలని భవన నిర్మాణ రంగ  కార్మికులు మంగళవారం కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. అంతకుముందు టవర్ సర్కిల్ లేబర్ అడ్డా నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేశ్​మాట్లడుతూ అడ్డా మీద ఒక జంటకు రూ.1,550 అమలు చేస్తే,  బిల్డర్లు, కాంట్రాక్టర్లు వలస కార్మికులకు రూ.1000 ఇచ్చి పనులు చేయించుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు సమ్మయ్య, కార్మికులు ఉన్నారు.