ఫుడ్ సేఫ్టీ విషయంలో ఎవరు తప్పు చేసినా వదలం

ఫుడ్ సేఫ్టీ విషయంలో ఎవరు తప్పు చేసినా వదలం
  • ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు: దామోదర రాజనర్సింహ
  • టెస్టింగ్ ల్యాబ్​ను ఆధునీకరిస్తున్నం
  • హైదరాబాద్ బిర్యానీకి ఉన్న మంచి పేరు చెడగొట్టొద్దని మంత్రి హితవు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఫుడ్ సేఫ్టీ విషయంలో ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. నాణ్యమైన ఫుడ్ అందించే వారికి అండగా ఉంటామని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే చట్టప్రకారం చర్యలు తప్పవని అన్నారు. హోటల్స్, స్ట్రీట్ ఫుడ్ వెండర్స్​తో పాటు హాస్టళ్లు, హాస్పిటల్స్, వర్క్ ప్లేసుల్లో ఉండే క్యాంటీన్లు కూడా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాల్సిందే అని స్పష్టం చేశారు. 

ప్రభుత్వ, ప్రైవేటు హాస్టల్స్​లో మంచి భోజనం పెట్టనివారిని కూడా శిక్షిస్తామన్నారు. హైదరాబాద్ వెంగళరావు నగర్​లోని ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్​లో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్​మెంట్ మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. మంత్రి దామోదర హాజరై.. స్ట్రీట్ పుడ్ వెండర్స్​కు ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘ఫుడ్ సేఫ్టీ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న అంశంలో రాజీపడొద్దు. రూల్స్ ప్రకారం బిజినెస్ చేసేవాళ్లకు ప్రభుత్వం సహకరిస్తది. పరిసరాలను క్లీన్​గా ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరూ లైసెన్స్ తీసుకోవాలి. బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు ఉన్నది. నిబంధనలు ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవాలి’’అని మంత్రి దామోదర అధికారులను ఆదేశించారు. 

ఏడాదికి 24వేల శాంపిల్స్ టెస్ట్ చేసేలా..

గత పదేండ్లలో పెరిగిన హోటళ్లు, జనాభాకు అనుగుణంగా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్​మెంట్ బలోపేతం కాలేదని మంత్రి దామోదర తెలిపారు. ‘‘ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల సంఖ్యను పెంచుతాం. నాచారంలోని ఫుడ్ సేఫ్టీ ల్యాబ్​ను ఆధునీకరిస్తున్నం. వరంగల్, నిజామాబాద్, మహబూబ్​నగర్​లో కొత్తగా మరో మూడు ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్​లను ఏర్పాటు చేస్తున్నం. ఏడాదికి కనీసం 24వేల ఫుడ్ శాంపిల్స్​ను టెస్ట్ చేసేలా ల్యాబ్​లను అందుబాటులోకి తీసుకొస్తున్నం’’అని మంత్రి దామోదర తెలిపారు. 

భద్రకాళి టెంపుల్‌‌కు భోగ్ సర్టిఫికేషన్

వరంగల్‌‌లోని భద్రకాళి దేవస్థానానికి, హైదరాబాద్‌‌లోని శ్రీ జయలక్ష్మి మాతా యోగా సెంటర్ ట్రస్ట్‌‌కు భోగ్ సర్టిఫికెట్లను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అందజేశారు. హైజీనిక్ కండీషన్‌‌లో ఫుడ్ తయారు చేస్తూ.. నిబంధనలు పాటించే ఆలయాలకు ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి భోగ్ (బ్లిస్​ఫుల్ అండ్ హైజెనిక్ ఆఫరింగ్ టు గాడ్​)సర్టిఫికెట్‌‌ ఇస్తారు. రాష్ట్రంలో యాదగిరిగుట్ట లక్ష్మినర్సింహ స్వామి టెంపుల్, సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్, బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ సహా సుమారు పది ఆలయాలు, ధ్యాన మందిరాలకు భోగ్ సర్టిఫికేషన్ ఉంది.