
న్యూఢిల్లీ: అమెరికా దాడులకు తెగబడితే.. తామూ ప్రతిదాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. మిసైళ్లు కూడా సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. న్యూక్లియర్ డీల్‌కు ఒప్పుకోకపోతే బాంబులు వేస్తామన్న ట్రంప్ కామెంట్లను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ప్రత్యక్ష చర్చల కంటే పరోక్ష చర్చలకే తాము ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేసింది. ట్రంప్‌కు ఇంకా చర్చలకు అవకాశం ఉందని తెలిపింది.
ఇరాన్ మిసైళ్లను సిద్ధం చేస్తున్నట్లు అక్కడి లోకల్ మీడియా టెహ్రాన్ టైమ్స్‌లో వార్తలు వస్తున్నాయి. అమెరికా వైమానిక దాడులకు దీటుగా బదులిచ్చేలా మిసైళ్లను ఇరాన్ రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఇరాన్ వ్యాప్తంగా ఉన్న భూగర్భ ప్రయోగ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో మిసైళ్లను లాంచ్‌ప్యాడ్‌లపై సిద్ధంగా పెట్టినట్లు సమాచారం. న్యూక్లియర్ డీల్‌కు నిరాకరిస్తే బాంబు దాడులు చేస్తామని ట్రంప్ బెదిరింపులు సరికావని ఫైర్ అయింది. ఎయిర్‌ఫోర్స్‌తో పాటు ఆర్మీని కూడా రంగంలోకి దించినట్లు తెలుస్తున్నది. అమెరికా సంబంధిత ప్రాంతాలపై దాడులు చేసేందుకు మిసైళ్లను వినియోగించుకోనున్నట్లు తెలిసింది.
ట్రంప్ బాంబు బెదిరింపులపై ఇరాన్ ఫైర్
ఇరాన్‌పై అమెరికా దాడులకు తెగబడితే ఎదురుదాడులు చేసేందుకు వెనకాడమని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని స్పష్టం చేశారు. న్యూక్లియర్ డీల్ విషయంలో ప్రత్యక్ష చర్చలకు రాకపోతే బాంబులు వేస్తామని బెదిరించడం సరికాదన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకోకుండా అమెరికా అడ్డుకుంటున్నదని మండిపడ్డారు. తాము చర్చలకు సిద్ధమే అని ప్రకటించారు.
అయితే.. అవి పరోక్షంగా నిర్వహించాలని తేల్చి చెప్పారు. అమెరికాతో ఎప్పటికీ ప్రత్యక్ష చర్చల్లో పాల్గొనబోమని స్పష్టం చేశారు. న్యూక్లియర్ డీల్ విషయంలో అమెరికాతో నేరుగా చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మరోసారి స్పష్టం చేశారు. ట్రంప్ బాంబు దాడులకు భయపడబోమన్నారు. ఎన్నో వాగ్ధానాలను అమెరికా కాలరాసిందని ఫైర్ అయ్యారు. దీనిపైనే తమకు బేదాభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు. ముందుగా అమెరికా తమకు నమ్మకం కలిగించాలని కోరారు.