టెర్రరిజానికి తలొగ్గం .. టెర్రరిస్టులను వదిలిపెట్టబోం: అమిత్​షా

టెర్రరిజానికి తలొగ్గం .. టెర్రరిస్టులను వదిలిపెట్టబోం: అమిత్​షా
  • టెర్రర్ దాడిలో కన్నుమూసిన వారికి శ్రీనగర్​లో నివాళి
  • బాధిత కుటుంబాలు, గాయపడ్డవారికి కేంద్ర హోం మంత్రి పరామర్శ
  • ఘటనా స్థలిలో ఏరియల్​ సర్వే.. పోలీసు అధికారులతో రివ్యూ

శ్రీనగర్: టెర్రరిజానికి భారత్​ తలొగ్గదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా పేర్కొన్నారు. టెర్రర్ అటాక్​కు పాల్పడ్డవారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. జమ్మూకాశ్మీర్‌‌‌‌లోని పహల్గామ్​లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి ఆయన నివాళులర్పించారు. బుధవారం ఉదయం శ్రీనగర్‌‌‌‌కు చేరుకున్న అమిత్ షా.. స్థానిక పోలీస్​కంట్రోల్​రూంలో ఉంచిన మృతదేహాలపై పుష్పగుచ్ఛం సమర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు. బాధిత కుటుంబాలను కలిసి, పరామర్శించారు. 

ఆ సమయంలో బాధిత కుటుంబాలు కన్నీళ్లతో షాను వేడుకుంటున్న దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్‌‌‌‌ అయ్యాయి. ఈ సందర్భంగా ఈ దుర్ఘటనకు కారణమైన వారిని వెతికి పట్టుకొని, శిక్షించి తీరుతామని బాధిత కుటుంబాలకు అమిత్‌‌‌‌ షా స్పష్టం చేశారు. ఆయన వెంట జమ్మూకాశ్మీర్​ లెఫ్టినెంట్​ గవర్నర్ మనోజ్​ సిన్హా ఉన్నారు. 

అనంతరం అమిత్​ షా ‘ఎక్స్​’లో పోస్ట్​ పెట్టారు. ‘‘భారమైన హృదయంతో పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు నివాళి అర్పిస్తున్నా. బాధితుల ఆవేదనను ప్రతీ భారతీయుడు అనుభవిస్తున్నాడు. ఈ దు:ఖాన్ని మాటల్లో వ్యక్తపరచలేం. ఉగ్రవాదానికి దేశం తలొగ్గదు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని విడిచిపెట్టం. బాధిత కుటుంబాలతోపాటు యావత్​ దేశానికి నేను హామీ ఇస్తున్నా” అని ట్వీట్​ చేశారు.  

ఏరియల్​ సర్వే నిర్వహించిన షా

ఉగ్రదాడి జరిగిన పహల్గామ్​లోని బైసరన్ ప్రాంతంలో అమిత్​ షా ఏరియల్​ సర్వే నిర్వహించారు. ఈ దాడికి సంబంధించి అధికారుల నుంచి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. అక్కడి పరిస్థితిని అమిత్​షాకు జమ్మూకాశ్మీర్​ డీజీపీ నలిన్​ప్రభాత్​ వివరించారు. 

అనంతరం పహల్గామ్ ఉగ్రవాద దాడిలో గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు అమిత్ షా  అనంత్‌‌‌‌నాగ్‌‌‌‌లోని ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్నవారిని కలిసి, ధైర్యం చెప్పారు. అమిత్​షా వెంట లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జమ్మూ కాశ్మీర్​ సీఎం ఒమర్ అబ్దుల్లా ఉన్నారు.