బోధన్/ఆర్మూరు, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన నెల రోజుల్లోనే నిజాం షుగర్స్‌ను తెరిపిస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ హామీ ఇచ్చారు. బోధన్, ఆక్మూర్ పట్టణంలో బుధవారం నిర్వహించన చాయ్‌పే చర్చ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ రైతులు, ప్రజలను మోసం చేసిందన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ, రూ.500 బోనస్, మహిళలకు గృహజ్యోతి, కల్యాణలక్ష్మి, తులం బంగారం, డబుల్ ఇండ్ల స్కీమ్‌లు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజలకు న్యాయం జరగాలంటే బీజేపీ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ రైతుల బాగు కోసం అనేక పనులు చేస్తున్నారని చెప్పారు.
ఫర్టిలైజర్, యూరియా మీద రూ. 18 వేల సబ్సిడీ, ప్రతి ఎకరాకు రూ.6 వేలు కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తున్నట్లు చెప్పారు. నిజామాబాద్ జిల్లాకు పసుపు, జగిత్యాల జిల్లాకు మామిడిని వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కింద ఎంపిక చేశారన్నారు. పసుపును ఇతర దేశాలకు ఎగుమతి చేయడం వల్లే మంచి ధర వచ్చిందన్నారు. ఆర్మూర్‌లోని జీవన్ మాల్ విషయంలో అధికారంలోకి రాగానే నోటీసులు ఇచ్చి హడావుడి చేసి ఇప్పుడు చప్పుడు చేయడం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు రూ. 50 కోట్లు కట్టాలని, ఆర్టీసీ, మున్సిపల్ బిల్లులు బకాయి ఉన్నాయన్నారు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు లావాదేవీలపైనే కోట్ల ఆదాయం వస్తోందన్నారు. ఆ డబ్బులన్నీ కొన్నేళ్లుగా సిరిసిల్ల, సిద్ధిపేటకు తరలిపోయాయని చెప్పారు.