ఎన్టీఏ రిప్లై తర్వాతే ఉత్తర్వులిస్తాం : సుప్రీం

ఎన్టీఏ రిప్లై తర్వాతే ఉత్తర్వులిస్తాం : సుప్రీం
  •     ‘నీట్’ అంశంలో సీబీఐ దర్యాప్తుపై తేల్చిచెప్పిన సుప్రీం
  •     రెండు వారాల్లో రిప్లై ఇవ్వాలని ఎన్టీఏకు ఆదేశం
  •     కేంద్రం, సీబీఐకీ నోటీసులు
  •     ‘కోటా’ ఆత్మహత్మలకు నీట్​కు సంబంధం లేదని స్పష్టం
  •     తదుపరి విచారణ జులై 8కి వాయిదా 

న్యూఢిల్లీ : మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (నీట్ యూజీ) 2024 ఎగ్జాంలో అవకతవకలపై సీబీఐ దర్యాప్తును కోరుతూ దాఖలైన పిటిషన్లపై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ మేరకు ఎన్టీఏకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. 

నీట్ కేసుకు సంబంధించి దాఖలైన మొత్తం 7 రిట్ పిటిషన్లను కలిపి బెంచ్ విచారించింది. సీబీఐ దర్యాప్తు విషయంలో ఎన్టీఏ రిప్లై ఇచ్చిన తర్వాతే ఉత్తర్వులు జారీ చేస్తామని పిటిషనర్లకు స్పష్టంచేసింది. నీట్ ఎగ్జాంలో అవకతవకలపై సీబీఐ దర్యాప్తు విషయంలో తదుపరి విచారణలోగా అభిప్రాయం తెలపాలంటూ కేంద్రం, బిహార్ ప్రభుత్వం, సీబీఐకి కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. 

ఈ కేసులో తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది. అలాగే, రాజస్థాన్ లోని కోచింగ్ సెంటర్ల హబ్ అయిన కోటా సిటీలో జరిగిన స్టూడెంట్ల ఆత్మహత్యలకు, నీట్ యూజీ 2024కు సంబంధం లేదని బెంచ్ తేల్చిచెప్పింది. నీట్ యూజీ కౌన్సెలింగ్ పై స్టే ఇచ్చేందుకు మరోసారి నిరాకరించింది. నీట్ లో అక్రమాల కారణంగా స్టూడెంట్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్న వాదనలను తోసిపుచ్చింది. ఈ కేసులో అనవసరమైన భావోద్వేగపూరిత వాదనలు వద్దని పిటిషనర్లకు హితవు పలికింది. 

వెంటనే ఉత్తర్వులు ఇవ్వలేం.. 

ఇది 24 లక్షల మంది స్టూడెంట్ల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న విషయమని, వెంటనే వారికి రిలీఫ్​ కలిగేలా ఉత్తర్వులు ఇవ్వాలని వెకేషన్ బెంచ్​ను పిటిషనర్ల తరఫు అడ్వకేట్ కోరారు. దీనిపై జస్టిస్ విక్రమ్ నాథ్ స్పందిస్తూ.. ఉత్తర్వులు ఇచ్చేముందు ఎన్టీఏ వివరణను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే, నీట్ యూజీ 2024 ఎగ్జాం పేపర్ లీక్ అయిందని, అక్రమాలు జరిగాయని.. అందుకే ఆ ఎగ్జాంను మళ్లీ నిర్వహించాలంటూ వివిధ రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలన్న ఎన్టీఏ వినతిని కూడా సుప్రీం బెంచ్ పరిశీలించింది. దీనిపై స్పందన తెలియజేయాలంటూ సంబంధిత పిటిషనర్లకు నోటీసులు జారీ చేసింది.

ఇదీ కేసు.. 

నీట్ యూజీ 2024 ఎగ్జాం మే 5న దేశవ్యాప్తంగా 4,750 సెంటర్లలో జరిగింది. 24 లక్షల మంది రాశారు. ఎన్టీఏ చరిత్రలోనే ఈసారి అత్యధికంగా 67 మందికి 720 స్కోరు రావడం, ఫరీదాబాద్ సెంటర్​ ఒక్కదాంట్లోనే ఆరుగురు టాప్​లో ఉండడం సందేహాస్పదంగా మారింది. గ్రేస్ మార్కులు కలపడం వల్లే టాప్ ర్యాంక్ వచ్చిందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఎగ్జాం సెంటర్ల లో అవకతవకలు జరిగాయని, విచారణ జరిపించాలని కోర్టును ఆశ్రయించారు.