కేసీఆర్​ అవినీతి లెక్కలు తీస్తం

కేసీఆర్​ అవినీతి లెక్కలు తీస్తం
  • కుటుంబంతో కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నడు: తరుణ్​చుగ్​
  • రాజ్యాంగంపై నమ్మకం లేకుంటే సీఎం పదవి నుంచి దిగిపోవాలి
  • మోడీపై ఉమ్మాలని చూస్తే  కేసీఆర్ మీదనే పడ్తదని హెచ్చరిక
  • బీజేపీలో చేరిన ఆర్మూర్ టీఆర్ఎస్, కాంగ్రెస్​ నేతలు

న్యూఢిల్లీ, వెలుగు: కేసీఆర్​కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, కుటుంబంతో కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, ఆ అవినీతి లెక్కలు తీస్తామని బీజేపీ స్టేట్​ ఇన్​చార్జ్​ తరుణ్ చుగ్ హెచ్చరించారు. ‘‘తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ అడ్డుగా మారారు. రానున్న ఎన్నికల్లో ఆ అడ్డును తొలగిస్తాం. మోడీ నేతృత్వంలో తెలంగాణలో బీజేపీ వేగంగా విస్తరిస్తుంది. రోజూ బీజేపీలోకి జాయినింగ్స్ పెరుగుతున్నాయి” అని చెప్పారు. నియంతృత్వ, కుటుంబ పాలన కేసీఆర్ గుణాల్లో ఉన్నాయని, రోజు రోజుకూ ఆయన చేతిలో నుంచి అధికారం చేజారిపోతున్నదన్నారు. కేసీఆర్ సర్కార్ కేవలం కుటుంబం కోసమే పనిచేస్తున్నదని, అందువల్లే చాలా మంది టీఆర్ఎస్​ను వదిలి బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. గురువారం ఢిల్లీలో తరుణ్ చుగ్ సమక్షంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కు చెందిన ముఖ్య నేతలు బీజేపీలో చేరారు. ఇందులో ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ కె.గంగాధర్, స్టేట్ సీడ్స్ సబ్ కమిటీ మెంబర్ యామాద్రి భాస్కర్, మాజీ ఉప సర్పంచ్ సడక్ మోహన్, బాషెట్టి దయాల్, కర్ణం కృష్ణ గౌడ్, ముత్తన్న, జక్కం పోశెట్టి, రమేశ్, రాజేశ్, సాయిలు తదితరులు ఉన్నారు. వారికి తురుణ్ చుగ్ కుండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  కార్యక్రమంలో బీజేపీ స్టేట్​చీఫ్ బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్​ పాల్గొన్నారు. రాజ్యాంగంపై నమ్మకం లేకుంటే దిగిపో. కేసీఆర్ నియంతృత్వ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని తరుణ్​చుగ్​ అన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి కేసీఆర్ సీఎం అయ్యారని, ఆ రాజ్యాంగంపై నమ్మకం లేకపోతే ఫస్ట్ సీఎం పదవి నుంచి దిగిపోవాలన్నారు. ‘‘అంబేద్కర్ రాసిన రాజ్యాంగం స్థానంలో.. కల్వకుంట్ల రాజ్యాంగం తేవాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వం. రాజ్యాంగ్యాన్ని అనుసరించి దేశం నడుస్తున్నదనే విషయం గుర్తుంచుకోవాలి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అన్ని వర్గాల శ్రేయస్సు, రక్షణ, అభివృద్ధిని కాంక్షిస్తున్నది. అత్యంత శక్తివంతమైన ఓటు అనే ఆయుధాన్ని కూడా ఇచ్చింది. కేసీఆర్ తాను కంటున్న కలల్లో రారాజుగా ఊహించుకుంటున్నారు. ఆ డ్రీమ్ నుంచి బయటకు రావాలి” అని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, దళిత సీఎం, దళిత బంధు, గల్ఫ్ కార్మికుల రక్షణ ప్యాకేజీ అంటూ కేసీఆర్ ఇచ్చిన ఏ హామీలు నెరవేరలేదన్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ దగ్గర ఏమీ లేదని, అందుకే ఇచ్చిన హామీల నుంచి ప్రజల దారి మళ్లించేందుకు రాజ్యాంగంపై కామెంట్లు చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరగకుండా బీజేపీ పోరాడుతుందన్నారు. ‘‘ప్రధాని మోడీ చంద్రుడి లాంటి వారు. చంద్రుడిపై ఉమ్మితే, తిరిగి తనపైనే పడుతుందని కేసీఆర్ గుర్తుంచుకోవాలి. తెలంగాణ ప్రజలు తొందర్లోనే కేసీఆర్​కు సమాధానం చెప్తారు” అని ఆయన హెచ్చరించారు. 

మోడీపై ఉమ్మాలని చూస్తే కేసీఆర్​ ముక్కుపైనే పడ్తది: అర్వింద్​

గత లోక్​సభ ఎన్నికల్లో ఆర్మూర్ ప్రజలు ప్రధాని మోడీని ఆశీర్వదిస్తూ, తనకు భారీ మెజార్టీ ఇచ్చారని, ప్రస్తుతం అక్కడి ముఖ్య నేతల రాకతో ఆర్మూర్​లో బీజేపీ మరింత స్ట్రాంగ్ అయిందని ఎంపీ ధర్మపురి అర్వింద్​ అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్​సభ పరిధిలో బీజేపీ మరిన్ని స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మోడీపై టీఆర్​ఎస్​ వాళ్లు ప్రివిలేజ్​ మోషన్​ ఇవ్వడం కాదని, రాజ్యాంగాన్ని అవమానించినందుకు కేసీఆర్​పై ప్రివిలేజ్​ మోషన్​ మూవ్ చేయాల్సి ఉంటుందని, కోర్టుకు  కూడా పోవాల్సి ఉంటుందని అన్నారు. కేసీఆర్ వాడే భాషకు అసెంబ్లీ పొద్దస్తమానం ప్రివిలైజ్ మోషన్లతోనే నిండిపోతుందని చెప్పారు. ‘‘ప్రధాని మోడీపై కేసీఆర్​ ఉమ్మాలని చూస్తే, అది కేసీఆర్​ ముక్కుపైనే పడుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి” అని అర్వింద్​ 
హెచ్చరించారు.

కేసీఆర్​పై అసెంబ్లీలో ప్రివిలేజ్​ మోషన్​ ఇస్తం: బండి సంజయ్​
టీవీల్లో బ్రేకింగ్​లు, పేపర్లలో హెడ్​ లైన్స్ కోసమే ప్రధానిపై ప్రివిలేజ్ మోషన్​ను టీఆర్ఎస్ ఇచ్చిందని బీజేపీ స్టేట్​ చీఫ్ బండి సంజయ్ అన్నారు. రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన కామెంట్ల నుంచి జనం దృష్టి మళ్లించేందుకే ఈ ప్రయత్నం అని మండిపడ్డారు. రాజ్యాంగంపై కేసీఆర్​ చేసిన కామెంట్లపై రానున్న అసెంబ్లీ సెషన్​లో కేసీఆర్ పై బీజేపీ ప్రివిలేజ్ మోషన్ ఇస్తుందన్నారు. మోడీ కాంగ్రెస్ పాలన తీరును ఎండగడితే, టీఆర్ఎస్ పార్టీ ఎందుకు స్పందిస్తుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. బీజేపీ మద్దతుతోనే తెలంగాణ వచ్చిందని స్పష్టం చేశారు. ‘‘అసలు లోక్ సభలో తెలంగాణ బిల్లు వస్తే, కేసీఆర్ ఎందుకు హాజరుకాలేదు. ఈ అంశంపై రాష్ట్ర ప్రజల్లో చర్చ జరుగుతున్నది. బీజేపీని  ఎదుర్కొనే దమ్ము, ధైర్యం టీఆర్ఎస్ కు లేదు” అని అన్నారు