భద్రాద్రి రామయ్య భూములు కాపాడుతాం

భద్రాచలం, వెలుగు: భద్రాద్రి రామయ్య భూములను కాపాడుతామని ఎండోమెంట్ మినిస్టర్​అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి అన్నారు. శ్రీసీతారామచంద్రస్వామిని బుధవారం ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఈవో రమాదేవి ఆధ్వర్యంలో అర్చకులు పరివట్టం కట్టి ఆలయంలోకి స్వాగతించారు. గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత లక్ష్మీతాయారు అమ్మవారి సన్నిధిలో వేదాశీర్వచనం ఇచ్చారు. ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. దేవుడి మాన్యాలను మనమే కాపాడుకోవాలన్నారు.

ఆంధ్రాలోని పురుషోత్తపట్నం భూముల ఆక్రమణలపై ఆంధ్రా సర్కారుతో మాట్లాడామని, హైకోర్టు తీర్పు కూడా అనుకూలంగా ఉందని వివరించారు. దీంతో ఆక్రమణలు తొలగిస్తున్నామని, బకాయిలు కూడా వసూలు చేస్తున్నట్లు చెప్పారు. భద్రాచలం ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. కేసీఆర్ హయాంలోనే ఆలయాలకు మహర్దశ దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. అందుకు యాదాద్రి ఆలయమే నిదర్శమన్నారు.  

అడవులను కాపాడేది ఆదివాసీలే


అడవులను కాపాడేది ఆదివాసీలేనని, హరితహారంతో రాష్ట్రంలో7.70శాతం పచ్చదనం పెరిగిందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి వెల్లడించారు. తునికాకు బోనస్​ చెక్కుల పంపిణీని దుమ్ముగూడెం మండలంలో బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తునికాకు అమ్మకాల్లో వచ్చిన లాభాల వాటాను గిరిజనులకే ఇవ్వాలనే నిర్ణయంతో సీఎం కేసీఆర్​ జిల్లాకు రూ.75కోట్లు రిలీజ్ చేశారన్నారు.

ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, పీసీసీఎఫ్​ గాబ్రియల్, కలెక్టర్​అనుదీప్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీఎఫ్ వో లక్ష్మణ్​రంజిత్​ నాయక్​పాల్గొన్నారు.