భద్రాచలం రోడ్డుకు రైళ్లు పునరుద్ధరించకుంటే ఆందోళన చేస్తాం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  భద్రాచలం రోడ్డుకు వచ్చే రైళ్లను వారం లోపు పునరుద్ధరించకుంటే ఆందోళన చేస్తామని అఖిలపక్ష నాయకులు, రైల్వే పోరాట కమిటీ లీడర్లు  హెచ్చరించారు. ఈ విషయమై సోమవారం కొత్తగూడెం రైల్వే స్టేషన్ మాస్టర్ కుందన్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా  రైల్వే పోరాట కమిటీ కన్వీనర్ కొదమసింహం పాండురంగా చారి మాట్లాడుతూ  కొత్తగూడెం రైల్వే స్టేషన్ కేవలం బొగ్గు  రవాణా కే పరిమితమైందన్నారు.  ఉదయాన్నే బయిలుదేరే సింగరేణి, కొల్హాపూర్ ట్రైన్లు రద్దు చేయడంతో  వ్యాపారస్తులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.  

స్టేషన్ మాస్టర్  కుందన్ కుమార్ మాట్లాడుతూ సమస్యను రైల్వే జీఎం, ఏరియా మేనేజర్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో సీపీఎం, సీపీఐ, ఎమ్మార్పీఎస్, నాయకులు,  రైల్వే పోరాట కమిటీ సభ్యులు  సత్యనారయణ, శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ చైతన్య,కృష్ణ, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.