హైదరాబాద్: అసలైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేలా ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గురువారం (డిసెంబర్ 5) హైదరాబాద్ కలెక్టరేట్లో అర్హులైన లబ్ధిదారులకు మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పట్టాలు పంపిణీ చేశారు. జూబ్లీహిల్స్, ముషీరాబాద్ నియోజకవర్గం లోని 81 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్ళ పట్టాలు అందజేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం కమలా నగర్‌కు చెందిన 44 మంది లబ్ధిదారులకు, ముషీరాబాద్ నియోజకవర్గం బాకారంకు చెందిన 37 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇవ్వనున్న ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు లేకుండా చూసుకుంటామని తెలిపారు. మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు.
Also Read :- తల తాకట్టు పెట్టి అయినా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం
ఇక, హైదరాబాద్ స్లమ్ ప్రాంతాల్లో నివసించే వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అభివృద్ధికి 8 వేల కోట్లతో డెవలప్మెంట్ పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని తెలిపారు. నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్‌ను అధిగమించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఠా గోపాల్, నగర మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్, తదితరులు హాజరయ్యారు.