మహబూబ్‌నగర్, వెలుగు : మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ హాస్పిటల్(జీజీహెచ్)లో రూ.13 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఎంఆర్ఐ కేంద్రాన్ని, రూ.4 కోట్లతో ఏర్పాటు చేస్తున్న గుండె జబ్బులను పరీక్షించే క్యాథ్ ల్యాబ్‌ను ఆదివారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని పేదలకు హైదరాబాద్ తరహాలో వైద్యం అందిస్తామని, అదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. గతంలో డెంగీ, మలేరియా, విషజ్వరాలు, సీజ నల్ వ్యాధులు, ఇతర వైద్య సేవలు అందక చాలా మంది చనిపోయారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను మెరుగుపరిచినట్లు చెప్పారు. గతంలో జీజీహెచ్‌లో నెలకు 20 నుంచి 30 ప్రసవాలు మాత్రమే జరిగేవని, ఇప్పుడు వెయ్యికిపైగా జరుగుతున్నాయన్నారు.
తెలుగు అనువాద శిఖరం ‘జలజం’
మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: తెలుగు సాహిత్య అనువాద శిఖరం జలజం సత్యనారాయణ అని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన సంస్మరణార్ధం ఆదివారం జిల్లా కేంద్రంలో ‘జలజం సాహిత్య సమాలోచన’ అనే కార్యక్రమం నిర్వహించారు. హాజరైన మంత్రి లిటిల్ స్కాలర్స్ హైస్కూల్లో రూపొందించిన ప్రత్యేక సంచిక ‘జలజం దీపిక’, అనల, కురుక్షేత్రం పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కాళోజీ, జలజం ఫొటోలకు నివాళి అర్పించారు. జలజం తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేశారని గుర్తు చేశారు. అనంతరం తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ మాట్లాడుతూ దేశాన్ని మతోన్మాదం కమ్మేస్తున్నప్పుడు మౌనం వహిస్తే అది దేశాన్నే ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్. రఘు, ఓయూ ప్రొఫెసర్ఎస్.రఘు, కాళోజీ అవార్డు గ్రహీత వెంకటేశ్వర్ రెడ్డి , తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ చెన్నయ్య, ‘దక్కన్ లాండ్’ ఎడిటర్మణికొండ వేదకుమార్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం
కోస్గి టౌన్ , వెలుగు : కొత్త అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వంలో టీటీడీపీకి పూర్వ వైభవం వస్తుందని పార్టీ పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి డీకే రాములు అన్నారు. ఆయన ఆదివారం కోస్గిలో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు రాష్ట్రంలో 32 లక్షల పార్టీ సభ్యులు సభ్యత్వాలు తీసుకున్నారని, కొత్త అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఇంకా చాలా మందిని పార్టీలో చేర్పించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. పార్టీలో చేరేందుకు ఇతర పార్టీల లీడర్లు చాలామంది ముందుకు రాబోతున్నారని తెలిపారు. పాత, కొత్త కలయికతో పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతమవుతుందని తెలిపారు. మహబూబ్నగర్పార్లమెంట్ పరిధిలో ఇంకా పార్టీ సభ్యులను చేర్పించడానికి అందరూ నాయకులు కలిసి కృషి చేయాలని కోరారు. సామల వెంకట ప్రసాద్, కుమ్మరి అంజిలయ్య , మోహన్ జీ, అచ్యుతా రెడ్డి , అంబ దాస్ పాల్గొన్నారు .
ఇథనాల్ కంపెనీపై చర్యలు తీసుకోవాలి
మరికల్, వెలుగు : చిత్తనూర్ ఇథనాల్కంపెనీని రద్దు చేయాలని 20 గ్రామాల ప్రజలు డిమాండ్ ను నెరవేర్చేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని పాలమూరు అధ్యయన వేదిక కమిటీ సభ్యులు వెంకట్రాములు కోరారు. ఆదివారం మండల కేంద్రంలోని యువ మండలి బిల్డింగ్‌లో ఇథనాల్కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు మీటింగ్నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంపెనీ వద్దని ఆయ గ్రామాల ప్రజలు ఆఫీసర్లను, ప్రభుత్వాలను కోరుతున్నా.. వారు పెడచెవిన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 16న పాలమూరు యూనివర్సిటీ స్టూడెంట్లతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ నెల చివరి వారంలో హైదరాబాద్‌లోని మేధావులతో రౌండ్టేబుల్సమావేశాన్ని కూడా నిర్వహించేందుకు చర్చించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇథనాల్కంపెనీపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సుదర్శన్, లక్ష్మయ్య, చంద్రశేఖర్, మహదేవ్, నాగరాజు, వెంకటేశ్, గడ్డం కృష్ణ, నాగేశ్ తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ
ఆమనగల్లు, వెలుగు : పట్టణంలోని మండల పరిషత్ ఆఫీస్ఆవరణలో డాక్టర్బీఆర్అంబేడ్కర్విగ్రహ ఏర్పాటు కోసం ఆదివారం జడ్పీటీసీ అనురాధ, ఎంపీపీ అనిత భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ సేవ చేసిసన మహనీయులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అందుకోసం అందరి అభిప్రాయం మేరకు మండల పరిషత్ ఆవరణలో స్థలాన్ని కేటాయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు ఒగ్గు మహేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్ చెన్నకేశవులు, నాయకులు వస్పుల జంగయ్య, సాయిలు, దేవేందర్, హఫీజ్, నర్సింహ్మ, మల్లేశ్, రమేశ్, వెంకటేశ్, జానయ్య, మైసయ్య, పరమేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బీసీల అభివృద్ధికి కృషి చేయాలి
నవాబుపేట, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంక్‌గా వాడుకోవడం మాని, వారి అభివృద్ధికి కృషి చేయాలని బీసీసేన రాష్ర్ట అధ్యక్షుడు కృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని అజిలాపూర్ గ్రామంలో ‘పోరాడితేనే రాజ్యాధికారం’ కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలకు ఉచిత విద్య, వైద్యాన్ని అందించేందుకు కృషిచేయాలని డిమాండ్ చేశారు. బీసీ యువత, మహిళలు చైతన్యవంతులైనప్పుడే హక్కులను సాధించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు శ్రీకాంత్, శ్రీరాం, చెన్నయ్య, రమాదేవి, రేఖమ్మ, యాదమ్మ, సరసమ్మ, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.
నేటి ప్రజావాణి రద్దు
గద్వాల, వెలుగు: సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కు సంబంధించిన పనులలో బిజీగా ఉండడం వల్ల ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించుకొని కలెక్టర్ ఆఫీస్ కి రావద్దన్నారు.