
హైదరాబాద్: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు గురించే డిస్కషన్ నడుస్తోంది. ఈ కేసు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను షేక్ చేస్తోంది. కాసుల కక్కుర్తికి ఆశపడి కొందరు యూట్యూబర్లు, ఇన్ఫ్లూయన్స్ర్లు, సినీ సెలబ్రెటీలు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తూ ప్రజలను ఆకర్శిస్తున్నారు. సెలబ్రెటీల మాటలు నిజమేనని నమ్మి ఎంతో మంది పేద, మధ్య తరగతి ప్రజలు బెట్టింగ్ యాపుల్లో డబ్బులు పెట్టి నష్టపోతున్నారు. కొందరు అప్పులు చేసి మరీ ఆన్ లైన్ బెట్టింగ్ పెట్టి లాస్ అవుతున్నారు.
దీంతో ఒకవైపు బెట్టింగ్ యాపుల్లో నష్టాలు.. మరోవైపు చేసిన అప్పులు తీర్చలేక ఏమో చేయాలో అర్థం కాక చివరకు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బెట్టింగ్ యాప్స్‌ను డబ్బుల కోసం ప్రమోట్ చేస్తోన్న సెలబ్రెటీలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసిన పలువురు సెలబ్రెటీలపై కేసులు నమోదు చేశారు. విజయ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మీ, ప్రణతీ, నిధి అగర్వాల్, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, రీతు చౌదరితో పాటు పలువురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.
ALSO READ | అన్నీ చెక్ చేసుకున్న తర్వాతే రానా ఆ యాప్స్ ప్రమోట్ చేశాడు: పీఆర్ టీమ్
అయితే.. హైదరాబాద్ మెట్రో రైళ్లపైన బెట్టింగ్ యాప్ యాడ్స్ కనిపించడం కలకలం రేపుతోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తోన్న సెలబ్రెటీలపై కేసులు నమోదు చేస్తుండటంతో మరీ మెట్రో రైళ్ల మీద ఉన్న అడ్వర్టజైమెంట్ల పరిస్థితి ఏంటని నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాడ్స్ ఉన్న వీడియోలను షేర్ చేస్తోన్నారు. ఈ విషయం కాస్తా మెట్రో యజమానం దృష్టికి వెళ్లింది.
బెట్టింగ్ యాప్ యాడ్స్ విషయంలో పోలీసులు ఆగ్రహంగా ఉండటంతో మెట్రో మేనేజ్మెంట్ అప్రమత్తమైంది. ఈ మేరకు గురువారం (మార్చి 20) మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కొన్ని మెట్రో రైళ్లపై బెట్టింగ్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు ఉన్నాయన్న అంశం నా దృష్టికి వచ్చింది. ఆ ప్రకటనలను తక్షణమే తీసివేయాలని ఎల్‌అండ్‌టీ, సంబంధిత అడ్వర్టైజ్ మెంట్ ఏజెన్సీలను ఆదేశించానని ఆయన తెలిపారు. ఈ రాత్రికే (గురువారం మార్చి 20) అటువంటి ప్రకటనలను రైళ్లపై పూర్తిగా తీసివేస్తారని చెప్పారు.