కరీంనగర్: 75 ఏళ్లుగా దేశంలో, రాష్ట్రంలో రాజకీయంగా బీసీలు ఎంతో నష్టపోతున్నారని బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్ దాసు సురేశ్ అన్నారు. బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రెస్ భవన్ లో " బీసీ మేలుకో... నీ రాజ్యాన్ని ఏలుకో" పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. నిధులు, విధులు, రాజకీయాల్లో, కాంట్రాక్టుల్లో బీసీలకు సరైన ప్రాతినిధ్యం దక్కడంలేదని దాసు సురేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. మన ఓట్లతో గద్దెనెక్కి..వాళ్లు సోకులు చేసుకుంటున్నారని.. అందుకే బీసీలు మేల్కొని రాజ్యాన్ని ఏలుకునేలా ఎదగాలని సూచించారు. మునుగోడు సహా రాబోయే అన్ని ఎన్నికల్లో బీసీలను ఐక్యం చేస్తామన్న సురేశ్.. బీసీలను నియోజకవర్గాల వారీగా బలోపేతం చేసి అన్ని చోట్ల రాజకీయ శిక్షణ ఇస్తామని సురేశ్ చెప్పారు.
అవసరమైతే బీసీల ఎజెండాతో ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తామని దాసు సురేశ్ తెలిపారు. బీసీల అవకాశాలను అగ్రవర్ణాల నాయకులు దెబ్బకొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాలన్న ఆయన.. ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాకపోవడం దురదృష్టకరమన్నారు. బీసీల పట్ల ఏదైనా రాజకీయ అస్పృస్యత ఉందా అని ప్రశ్నించారు. బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్వంలో బలమైన నాయకత్వాన్ని తయారు చేసి గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో బీసీ రాజ్యాధికార సమితి తరపున బీసీ అభ్యర్థిని నిలబెడుతామని దాసు సురేశ్ తెలిపారు.