రాజన్న సిరిసిల్ల, వెలుగు: సెస్ ఎన్నికల్లో కేటీఆర్ అడ్డదారిలో గెలిచి బీజేపీకి ట్రైలర్ చూపించానంటూ మురిసిపోతున్నాడని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు, ఆయన పార్టీకి తప్పకుండా సినిమా చూపిస్తామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీరుద్రమ అన్నారు. సెస్ ప్రమాణ సీకారోత్సవంలో బీజేపీని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాణి రుద్రమ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కేటీఆర్ సిరిసిల్లలో బీజేపీని పదే పదే తలుచుకుంటున్నారని, బీజేపీ కార్యకర్తల పనితీరుతో ఆయనకు నిద్రపట్టడం లేదన్నారు. తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్లిన నిధులు, కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులపై గతంలోనే కేటీఆర్సవాల్ ను స్వీకరించి తాము చర్చకు రమ్మని ఆహ్వానించినా రాలేదన్నారు. ఇప్పటికైనా కేటీఆర్తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో ఏ సెంటర్ కు వచ్చినా తాము చర్చకు రెడీ అని అన్నారు.
బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో గులాబీ జెండా ఎగరేస్తానన్న కేటీఆర్సిరిసిల్లలో ఆయన సీటు పోకుండా చూసుకుంటే మంచిదన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో రేషన్ కార్డులు రాక, రేషన్ బియ్యం, పెన్షన్లు అందక, దళితబంధు రాక, ఉద్యోగాలు లేక అల్లాడుతున్న ప్రజలకు కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. సిరిసిల్ల నియోజకవర్గం ఎల్లారెడ్డిపేటలో రెండు రోజుల క్రితం పురుగుల అన్నం తినలేక స్కూల్స్టూడెంట్లు రోడ్డు ఎక్కారని, కలుషిత నీరు తాగి ఆసుపత్రి పాలయ్యారని చెప్పారు. కనీసం ఆ స్టూడెంట్లను మంత్రి కేటీఆర్ పరామర్శించకపోవడం సిగ్గుచేటన్నారు. దేశం, రాష్ట్రం గురించి తర్వాత.. ముందు సిరిసిల్లలో ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు, టెక్స్టైల్పార్క్ ఎందుకు మూతపడింది, సెస్ ఆఫీసులో జరిగిన అక్రమాలు ఇంకా ఎందుకు తేలలేదో చర్చకు రావాలని సవాల్ విసిరారు.