- ములుగు ఎస్పీ శబరీశ్
తాడ్వాయి, వెలుగు: లొంగిపోయిన మావోయిస్టు కుటుంబాలకు అండగా ఉంటామని ములుగు జిల్లా ఎస్పీ శబరీశ్తెలిపారు. రాష్ట్ర పోలీసులు నిర్వహిస్తోన్న ‘ పోరు కన్నా ఊరు మిన్న– -మన ఊరికి తిరిగి రండి’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మావోయిస్టు అగ్రనేతల కుటుంబాల ఇండ్లను సందర్శించారు. తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన మావోయిస్ట్ అగ్రనేత, రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్, గోవిందరావుపేట మండలం మొద్దులగూడెంకు చెందిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అల్లూరి సీతారామరాజు డివిజన్ కార్యదర్శి కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ కుటుంబ సభ్యులను కలిసి స్థితిగతులను తెలుసుకొని నిత్యావసరాలు పంపిణీ చేశారు.
అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టులు వనం వీడి జనంలోకి రావాలని కోరారు. మావోయిస్టుల్లో చాలామందికి ఆరోగ్య సమస్యలు ఉన్నందున, లొంగిపోతే.. తమ కుటుంబాలకు పోలీసులు అండగా ఉంటారని సూచించారు. పునరావాసం కింద రూ. 20 లక్షలతో పాటు ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. మావోయిస్టుల కుటుంబ సభ్యులతో మాట్లాడి లొంగిపోయేలా చూడాలని కోరారు. డీఎస్సీ రవీందర్, పస్రా సీఐ రవీందర్, తాడ్వాయి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, ఉన్నారు.