గడువులోగా రిపోర్ట్ ఇస్తం

గడువులోగా రిపోర్ట్ ఇస్తం
  • బీసీ డెడికేటెడ్​ కమిషన్​ చైర్మన్​ బూసాని వెంకటేశ్వరరావు
  • సంక్షేమ భవన్​లో చైర్మన్​గా బాధ్యతల స్వీకరణ

 హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మసాబ్​ ట్యాంక్​లోని సంక్షేమ భవన్​లో బీసీ డెడికేటెడ్​ కమిషన్​ చైర్మన్​గా బూసాని వెంకటేశ్వరరావు, మెంబర్​గా సైదులు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై  ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా రిపోర్ట్ అందజేస్తామని వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, బీసీ కమిషన్, బీసీ సంఘాల నుంచి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పారు.

బీసీ కమిషన్​తో భేటీ 

బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, మెంబర్స్​ బాలలక్ష్మి, జై ప్రకాశ్​, సురేందర్ ను డెడికేటెడ్​ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు, మెంబర్ సైదులు కమిషన్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా కుల గణన, ఇటీవల జిల్లాల్లో కమిషన్ నిర్వహించిన పబ్లిక్ హియరింగ్ వంటి అంశాలపై  చర్చించారు.

డీజీపీకి కమిషన్ లేఖ

నిజామాబాద్‌‌‌‌ జిల్లాలో బీసీ కులాల వారిని గ్రామాభివృద్ధి కమిటీలు సామాజికంగా బహిష్కరించడాన్ని తీవ్రంగా పరిగణించి, ఆ కమిటీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీకి  లేఖ రాయాలని బీసీ కమిషన్ నిర్ణయించింది. ఈ నెల 18 నుంచి  26  వరకు  వెనుకబడిన తరగతుల కులాల స్థితిగతులపై ఉమ్మడి 5 జిల్లాల్లో (నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌) బహిరంగ విచారణ జరపాలని  బీసీ కమిషన్  నిర్ణయించింది.  ఈ సమావేశంలో అక్టోబర్‌‌‌‌ 28 నుంచి నవంబర్‌‌‌‌ 2 వరకు ఆదిలాబాద్‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌, సంగారెడ్డి, కరీంనగర్‌‌‌‌, వరంగల్‌‌‌‌లో నిర్వహించిన బహిరంగ విచారణ కార్యక్రమాలను కమిషన్‌‌‌‌ సమీక్షించింది.