న్యూఢిల్లీ: రెండు దేశాల మధ్య ఉన్న రక్షణ, ఇంధన, వాణిజ్య సంబంధాలను భవిష్యత్ దృష్టికోణంలో మరింత బలోపేతం చేసుకోవాలని ఇండియా, శ్రీలంక నిర్ణయించాయి. ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కనెక్టివిటీ, మల్టీప్రొడక్ట్ పెట్రోలియం పైప్లైన్స్ ఏర్పాటుకు అంగీకారం తెలిపాయి. సోమవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో శ్రీలంక ప్రెసిడెంట్అనుర కుమార దిసనాయకే భేటీ అయ్యారు.
ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యం పెంచుకునేందుకు పెట్టుబడి ఆధారిత వృద్ధిపై చర్చించినట్టు ప్రధాని మోదీ తెలిపారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలకు ఫిజికల్, డిజిటల్, ఎనర్జీ కనెక్టివిటీ అనేవి మూల స్తంభాలుగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కనెక్టివిటీ, మల్టీప్రొడక్ట్ పైప్లైన్ఏర్పాటుకు కృషిచేస్తామని, దీని ద్వారా ద్వీప దేశమైన శ్రీలంక జాతీయ పవర్ప్లాంట్స్కు లిక్విడ్ నేచురల్ గ్యాస్(ఎల్ఎన్జీ) సరఫరా చేయొచ్చన్నారు.
శ్రీలంకకు ఫెర్రీ సర్వీస్
ఇరుదేశాల మధ్య కనెక్టివిటీని పెంచుకునేందుకు రామేశ్వరం నుంచి తలైమనార్కు ఫెర్రీ సర్వీసు (ప్రయాణికులతో పాటు వాహనాలు, సరుకులను రవాణా చేసే పడవ)లను పునరుద్ధరించనున్నట్టు ప్రకటించారు. ఫెర్రీ సర్వీసులు పునరుద్ధరణ ద్వారా ఇరు దేశాల ప్రజలకు ప్రయాణ సౌలభ్యం కలుగుతుందని, ఇది ద్వైపాక్షిక వాణిజ్యానికి కూడా కీలకంగా మారవచ్చని మోదీ అభిప్రాయపడ్డారు.
శ్రీలంకతో రక్షణ సహకారాన్ని బలపరచడం ద్వారానే ప్రాంతీయ భద్రతా పరిస్థితులు మెరుగవుతాయని తెలిపారు. ఇందుకోసం త్వరలోనే రక్షణ సహకారంపై ఒప్పందాన్ని ఫైనల్ చేస్తామని, హైడ్రోగ్రఫీ (నావిగేషన్ భద్రత) సహకారంపై కూడా అగ్రిమెంట్ చేసుకుంటామని ప్రకటించారు. తమిళుల సమస్యలపైనా చర్చించామని, శ్రీలంక ప్రభుత్వం తమిళ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని భారత్ ఆశిస్తున్నదని మోదీ చెప్పారు.
మత్స్యకారుల జీవనోపాధికి సంబంధించిన అంశంపై డిస్కస్ చేశామని, ఈ విషయంలో మానవతా దృక్పథంతో ముందుకుసాగాలని నిర్ణయించినట్టు చెప్పారు. శ్రీలంకకు ఇప్పటివరకూ 5 బిలియన్డాలర్ల అప్పు, సాయం అందించినట్టు మోదీ గుర్తు చేశారు. అనంతరం దిసనాయకే మాట్లాడుతూ.. శ్రీలంక ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత ఇదే తన తొలి విదేశీ పర్యటన అని తెలిపారు. భారత్లో పర్యటించడం ఆనందంగా ఉన్నదని చెప్పారు. తమ దేశానికి భారత్ మద్దతు ఉంటుందని మోదీ హామీ ఇచ్చారని వెల్లడించారు.